సీఎం చంద్రబాబు నాయకత్వంలో వేగంగా అభివృద్ధి..
1 min read

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
ఉర్దూ యూనివర్శిటీ పనులు పునః ప్రారంభించిన మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే ఉర్దూ యూనివర్శిటీ నిర్మాణం అప్పుడే పూర్తయ్యేదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఓర్వకల్లు సమీపంలో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి ఆయన భూమి పూజ చేసి పునః ప్రారంభించారు. ఈ ఉర్దూ యూనివర్శిటీ నిర్మాణానికి ఇదివరకే ఆయన రూ.1 కోటి విరాళం అందించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను గత ప్రభుత్వంలో నిలిపివేశారన్నారు. ఇందులో ఉర్దూ యూనివర్సిటీ, బీసీ భవన్, కాపు భవన్ లు ఉన్నాయన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్శిటీ పనులను మళ్లీ ప్రారంభించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. మంచి చేసే నాయకులను ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. సరైన విద్యను అందిస్తే విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చన్నారు. ఇటీవల చేపట్టిన దావోస్ పర్యటనలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌తో విద్యా వ్యవస్థ పై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయన్నారు. దావోస్ పర్యటనలో ఏ రాష్ట్రం చేయనంతగా ఏపీని ప్రమోట్ చేశామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందన్నారు. ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా కర్నూలు జిల్లాకు భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.10వేల కోట్ల పెట్టుబడుల పనులు మొదలయ్యాయని, రానున్న రోజుల్లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బి.కె సింగ్, రిజిస్ట్రార్ లోక్ నాథ్, వైస్ ఛాన్సలర్ షా వలి ఖాన్, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకులు జహంగీర్ భాష, తెలుగుయువత పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, సీనియర్ నాయకులు నౌషాద్, అబ్దుల్ హమీద్, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.


