NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అందరికీ  సమానావకాశాలుండాలని ఆశించిన దార్శనికుడు పూలే

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: భారతీయ సమాజం పరివర్తనకోసం అలుపెరగని కృషిచేసిన మహనీయులు మహాత్మా జ్యోతీబాపూలే అని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ ఆచార్య వి. వెంకట బసవరావు కొనియాడారు. మహాత్మా జ్యోతీబాపూలే జయంతి సందర్భంగా ఈరోజు వర్సిటీ సెనేట్ హాలులో జరిగిన కార్యక్రమంలో జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. కుల మత ప్రాంతీయ విభేదాలతోపాటు లింగవివక్షకు తావులేకుండా అందరికీ  సమానావకాశాలుండాలని ఆశించిన దార్శనికుడు పూలే అని కొనియాడారు. నాటి సమాజంలోని కులాలమధ్య హెచ్చుతగ్గులను, ఆధిపత్య ధోరణులను ఎదిరించి నిలిచిన మహనీయుడు పూలే అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికోసం పూలేదంపతులు చేసినకృషి అసామాన్యమని ఆచార్య బసవరావు నివాళులర్పించారు. బాల్యవివాహాలను నిరసించడం, వితంతువులకు పునర్వివాహాలు చేయడం మొదలైన ఎన్నోకార్యక్రమాలకు పూలే జీవితాన్ని ధారపోసారని రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ కొనియాడారు. అలాంటి మహనీయులు చూపిన దారిలో పయనిస్తూ అందరూ పురోగమించాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నతనంనుండి అసమానతల్ని, వివక్షను ఎదుర్కొన్నపూలే స్త్రీవిద్యను ప్రోత్సహించడంలో భాగంగా తన భార్య సావిత్రీబాయి పూలేను చదివించి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని  రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు వివరించారు. వర్సిటీలో పూలే వర్థంతిని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వర్సిటీ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. కులమతరహిత సమాజ స్థాపనకోసం యువత నడుంబిగించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సి. వి. కృష్ణారెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ శ్యామలా సరోజినితోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author