రిడ్జ్ పాఠశాలలో ఘనంగా ‘స్వర’ మహోత్సవ కార్యక్రమం…
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: స్థానిక లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ పాఠశాలలో ‘స్వర’ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రవీంద్ర విద్యాసంస్థల అధినేత శ్రీ జి. పుల్లయ్య మరియు ఆఫీసర్ కమాండిగ్ 9(ఎ) బాలికల బెటాలియన్ కల్నల్ జోబీ ఫిలిప్ తో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి, మాట్లాడుతూ రాళ్ళను సైతం కరిగించే శక్తి సంగీతానికి ఉందనీ, లలిత కళల్లో మనిషిని ఆహ్లాదపరిచే కళ సంగీతమని, విద్యార్థులు చదువులతో పాటు అనేక సృజనాత్మక కళలను అలవరచుకోవాలని తెలియజేశారు.కల్నల్ జోబీఫిలిప్ మాట్లాడుతూ మానవుడు తన జీవనయానంలో ఎదురయ్యే అలసటను యాంత్రికతను దూరం చేసుకోవడానికి కళలను, కవితల్ని ఆలంబనగా చేసుకొని విజ్ఞాన మార్గంలో ప్రయాణించాడని తెలిపారు. పాఠశాల సి.ఇ.ఓ గోపీనాథ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఇటువంటి కార్యక్రమం జరగడం ఇదే తొలిసారని, అది కూడా ఈ ఉత్సవానికి తమ పాఠశాల వేదిక అయినందుకు తమకెంతో సంతోషంగాఉందని తెలిపారు. మనిషి ఆటవిక దశలోనే తన గానమాధుర్యంతో ఎండిన మోడుల్ని కూడా చిగురింపజేశారనితెలిపారు. తదనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో, సంగీత స్వర మాధుర్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరంలో వివిధ విభాగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పతకాలు అంద జేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కో.సి.ఇ.ఓ సౌమ్యా గోపీనాథ్ , రవీంద్ర విద్యాసంస్థల ఛైర్మన్ జి.వి.ఎమ్.మోహన్ , రవీంద్ర విద్యాసంస్థల సలహాదారు మమత , రవీంద్ర గ్లోబల్ స్కూల్ సి.ఇ.ఓ వంశీగారు, కో.సి.ఇ.ఓ. సుప్రియ , డీన్ రాజేంద్రన్ , ప్రిన్సిపల్ రాజ్కమల్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
