ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స
1 min read
– తొడలోని ధమని ద్వారా కాథెటర్ పంపి కణితికి నేరుగా కీమో మందులు
అనంతపురం, న్యూస్ నేడు : లివర్ (కాలేయం)లో ఏర్పడిన క్యాన్సర్ కణితికి శస్త్రచికిత్స లేకుండా ఓ 64 ఏళ్ల వ్యక్తికి కిమ్స్ సవీరా ఆసుపత్రి వైద్యులు అధునాతన ట్రాన్స్ఆర్టీరియల్ కీమో-ఎంబోలైజేషన్ ద్వారా చికిత్సను విజయవంతంగా చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చికిత్సనందించిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. ఎస్.కె. పృథ్వీరాజ్ మరియు కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా. పి. వెంకట సింహా. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చీకలగురికి గ్రామానికి చెందిన ఎర్రిస్వామి (64) కడుపునొప్పితో బాధపడుతూ స్థానికంగా వైద్యులను సంప్రదించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కాలేయంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఈనెల 9న కిమ్స్ సవీరా ఆసుపత్రిలో చేరారు. ఇక్కడ చేసిన పెట్ సిటి మరియు ఎఫ్ఎన్ఏసి తదితర పరీక్షలు చేశాం. ఈ పరీక్షల్లో రోగికి హెపాటోసెల్యులర్ కార్సినోమా (HCC) అనే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం ఆంకోసర్జరీ విభాగం వైద్యుల అభిప్రాయం తీసుకోగా, రోగి శస్త్రచికిత్సకు అనుకూలంగా లేరు. దీంతో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగం వైద్యులు రోగి ఆరోగ్య పరిస్థితి, కణితి స్వభావం తదితర అంశాలను పరిశీలించి టిఏసిఈ చికిత్సను సూచించారు. తొడలోని ధమని ద్వారా సన్నని కాథెటర్ను కాలేయంలోని కణితికి రక్తాన్ని సరఫరా చేసే ధమని వరకు పంపించి, కీమోథెరపీ మందులను నేరుగా కణితి వద్దకు అందించడం ఈ చికిత్స ప్రత్యేకత .భవిష్యత్తులో మరిన్ని కీమోథెరపీలు అవసరం ఉండనున్నాయి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని రోగికి సూచించామని తెలిపారు. కాలేయ క్యాన్సర్ ప్రతి రోగిలో ఒకే విధంగా ఉండదని, కణితి పరిమాణం, వ్యాప్తి, కాలేయ పనితీరు, రోగి మొత్తం ఆరోగ్య పరిస్థితి ఆధారంగా చికిత్స విధానాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స సాధ్యం కాని రోగులకు టిఏసిఈ వంటి ఇంటర్వెన్షనల్ విధానాలు చికిత్సలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అయితే క్యాన్సర్ వచ్చిన ప్రతీ రోగికి ఈ పక్రియ సాధ్యం కాకపోవచ్చన్నారు. కాలేయంలో కణితి లేదా అనుమానాస్పద లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.


