రైతులకు 50 శాతం రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు
1 min read
జిల్లాలో 1400 మంది రైతులకు రూ. 3.94 కోట్ల రాయితీ
ఉంగుటూరు నియోజకవర్గంలో 115 మంది రైతులకు రూ. 77 లక్షల రాయితీపై పరికరాలు
నారాయణపురంలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :రైతాంగం ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని సాగుచేయాలని అందుకు కావాల్సిన సహాయ సహకరాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. శనివారం ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో వ్యవసాయ, యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.77 లక్షల రాయితీపై వివిధ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రైతులు అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో మూడు పంటలు పండిస్తూ రైతాంగం చాలా సాంకేతికత, ఆధునిక పరిజ్ఞానం కలిగియున్నారన్నారు. తద్వారా జిల్లాలో వ్యవసాయ, ఉధ్యానవన పంటలతో జీవిఏ వృద్ధిలో మూడవ స్ధానానికి తీసుకువెళ్లేందుకు కృషిచేయాలన్నారు. వ్యవసాయంపై మక్కువ కలిగిన తాను అభ్యుధయ రైతులున్న ఏలూరు జిల్లా కలెక్టర్ గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పంట సాగులో డ్రోన్స్ వినియోగించాలన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ లో సూక్ష్మ పోషకాలు పూర్తిరాయితీపై అందజేస్తామని తద్వారా వచ్చే ఖరీఫ్ సీజన్ సాగులో ఇంకా లాభాలు పొందాలని కోరారు. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పధకం ద్వారా 1400 మంది రైతులకు రూ. 3.94 కోట్ల రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఉధ్యానవన శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక పధకాలను అమలు చేస్తుందని వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఫైన్ వెరైటీ వరిసాగుపై రైతులు దృష్టిపెట్టాలని కలెక్టర్ సూచించారు. అందుకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పంటసాగులో రైతులు నష్టపోకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో పరిశీలిద్దామన్నారు. పరిశోధనలు ద్వారా ఫైన వెరైటీ వంగడాలు మీదగ్గరకు వచ్చినపుడు ఆ పంటసాగులో శాస్త్రవేత్తలు చెప్పే విషయాలు విని పంటసాగుకు ముందుకు రావాలని సూచించారు. గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం వాటిని రైతు ఖాతాలకు జమచేసిందన్నారు. గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక డ్రిప్ ఇరిగేషన్ ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలోని ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు మండలాల్లో మొత్తం 115 మంది రైతులకు పవర్ టిల్లర్స్, ట్రాక్టర్ పనిమూట్లు, స్పేయర్లు, సుమారు రూ. 77 లక్షల సబ్సిడీతో అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు పంపిణీకి రైతు సేవాకేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో యంపిపి ఘంటా శ్రీలక్ష్మి, నారాయణపురం, ఉంగుటురూ సర్పంచ్ లు దిడ్ల అలకనంద, బండారు సింధూ, తహశీల్దారు పి. రఘుకుమార్, యంపిడివో ఆర్. ప్రవీణ్ కుమార్, వ్యవసాయశాఖ ఎడి ఉషారాజకుమారి, వ్యవసాయ శాఖ అధికారులు ఎన్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎస్వీ. ఉషారాణి, ఎస్. గీత, మరియు సూరపు అయ్యప్ప తదితర పలువురు ప్రజా ప్రతినిధులు, తదితర వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.