మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలి
1 min read
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ఓటర్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం నంద్యాల పట్టణంలోని నడిగడ్డ 6వ వార్డు, సరస్వతీ నగర్ 15వ వార్డు, బొగ్గులైన్ 27వ వార్డు ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, ర్యాంపులు, ఇతర అవసరమైన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.



