ఎముకలు గట్టివేనా…!
1 min read
బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్న వృద్ధులు
- యువకుల్లో ఎముక విరిగేంత వరకు కనిపించని లక్షణాలు
- కిందకు జారినా… ఎముకలు విరిగే అవకాశమెక్కువ…
- ధూమపానం, మద్యం తాగే వారికి వ్యాధి తీవ్రత అధికం…
- వ్యాయామం చేస్తూ… పౌష్టికాహారం తీసుకుంటే మేలు..
- ప్రముఖ ఆర్థో పెడిక్ వైద్యులు
- నేడు ప్రపంచ ఆస్టియోపోరోసిస్ డే
- థీమ్…: “మౌన వ్యాధికి స్వరం ఇవ్వండి – నిర్లక్ష్యం అంగీకారయోగ్యం కాదు !”
మనిషి శరీరంలో ఎముకల సాంద్రత ఎంత నాణ్యతగా ఉంటుందో… జీవన శైలి కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది. కానీ వ్యాయామం లేకపోవడం.. పౌష్టిక ఆహారం తీసుకోకపోవడంతో విటమిన్ డి లోపం ఏర్పడి… ఎందరో వృద్ధులు బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎముకల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబరు 20న ప్రపంచ ఆస్టియోపోరోసిస్ డే ను జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ మౌన వ్యాధికి స్వరం ఇవ్వండి…నిర్లక్ష్యం అంగీకారయోగ్యం కాదు.
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు : వయస్సు పెరిగే కొద్దీ.. శరీరంలో ఎముకలు సాంధ్రత కోల్పోతూ.. బలహీనమవుతుంటాయి. దీనినే ఆస్టియోపోరోసిస్” అంటారు. ఎముకలు బలంగా ఉండాలంటే… శరీర ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎక్కువగా మహిళలను వేధించే ‘నిశ్శబ్ద ’వ్యాధిని జాగ్రత్తలు, మెడిసిన్తో నివారించవచ్చని ఆర్థో పెడిక్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
యువకుల్లో కనిపించని ‘ మౌన వ్యాధి’
సూర్య రశ్మి తగలకపోవడం… పౌష్టిక ఆహారం తీసుకోని ..చాలా మంది యువకుల్లో ఎముకలు తక్కువ సాంధ్రత కలిగి ఉంటాయి. లోపలి భాగం గుల్లగా ఉంటుంది. ఎముకలు విరిగేంత వరకు వారికి లక్షణాలు కనిపించవు. దీంతో కింద జారిపడినా.. తేలికపాటి దెబ్బ తగిలినా ఎముకలు సులభంగా విరిగిపోతాయి. దీన్ని “మౌన వ్యాధి (Silent Disease)” అని కూడా అంటారు . ఇది జీవన నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపి, స్వాతంత్ర్యాన్ని తగ్గించవచ్చు.
‘ వ్యాధి’ తెలియకుండానే..జీవనం..
ఆస్టియోపోరోసిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా తక్కువగా గుర్తించబడిన వ్యాధి మరియు చికిత్స పొందని వ్యాధి. చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నా దాని గురించి తెలియకుండానే జీవిస్తున్నారు. అందుకోసమే అంతర్జాతీయ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ (IOF) ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవం (World Osteoporosis Day – WOD)
ఈ సంవత్సరం నినాదం: “TO MAKE NOISE FOR THE ‘SILENT’ DISEASE. IT’S UNACCEPTABLE! THE OVERLOOKED CRISIS IN OSTEOPOROSIS PREVENTION AND CARE”
ప్రమాదం.. వీరికే…!
మెనోపాజ్ తర్వాత మహిళలు హార్మోన్ల మార్పులు, 50 ఏళ్లు పైబడిన పురుషులు, పొగ త్రాగడం, మద్యం త్రాగడం, వ్యాయామం లేకపోవడం ప్రధాన కారణాలు. కాల్షియం, విటమిన్ D లోపం , స్టెరాయిడ్ మందులు లేదా థైరాయిడ్/కిడ్నీ వ్యాధులు, తక్కువ బరువు (BM| < 19} లేదా కుటుంబ చరిత్ర ఉన్నవారికి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది .
ఎముకలు ఎందుకు బలహీనమవుతాయి?
ఎముకలు ఎప్పుడూ పాత కణజాలాన్ని కరిగించి కొత్త ఎముకను నిర్మించే ప్రక్రియలో ఉంటాయి. వయసు పెరిగేకొద్దీ కొత్త ఎముక నిర్మాణం తగ్గి, కరిగిపోవడం పెరుగుతుంది. ఫలితంగా ఎముకల బలం, సాంద్రత రెండూ తగ్గిపోతాయి.
ఆస్టియోపోరోసిస్ గుర్తించేదెలా…?
సాధారణంగా ఎటువంటి లక్షణాలు ఉండవు కానీ వెన్ను నొప్పి , ఎత్తు తగ్గడం, శరీరం వంగిపోవడం, చిన్న దెబ్బకే ఎముక విరగడం వంటి సూచనలు కనిపిస్తాయి.
వ్యాధి గుర్తింపు.. ఇలా…
DEXA స్కాన్ ద్వారా ఎముకల బలాన్ని కొలుస్తారు. T-score-2.5 కన్నా తక్కువ అయితే ఆస్టియోపోరోసిస్ ఉన్నట్టే. రక్తంలో కాల్షియం, విటమిన్ D స్థాయిలు కూడా చెక్ చేయాలి
ఆస్టియోపోరోసిస్ నివారణ :
ఎముకల ఆరోగ్యాన్ని జీవితమంతా ప్రాధాన్యతగా చూడాలి. యువత నుంచే ఆరంభించాలి. పాఠశాలలలోనే ఎముకలకు మేలు చేసే ఆహారం, వ్యాయామం గురించి అవగాహన కల్పించాలి.
ఎముకల ఆరోగ్యం ముఖ్యం..
- డా. ఎస్. రవితేజా రెడ్డి, ఆర్థో పెడిక్ వైద్యులు, శిరీష పాలి క్లినిక్
శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు ప్రతి రోజు వ్యాయామం చేయాలి. కాల్షియం, విటమిన్ D, ప్రోటీన్, విటమిన్ K (పాలు, పెరుగు, చేపలు, బాదం, నువ్వులు, ఆకుకూరలు) ఉన్న ఆహారం తీసుకోవాలి. వయస్సుతో అవసరాలు మారుతాయి. మహిళలు ఎక్కువ కాల్షియం అవసరం. యువత మరియు మెనోపాజ్ తర్వాత సూర్యరశ్మి తగలని వారు లేదా ఆహారంలో సరిపడా కాల్షియం తీసుకోలేని వారు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.

వ్యాయామం తప్పనిసరి…
- డా. ఎన్. బాలకృష్ణ డిఎన్బి, ఆర్థో పెడిక్, అమీలియో హాస్పిటల్
పిల్లల వయస్సు నుంచే వ్యాయమం చేయాలి. దీని వల్ల ఎముకలు వృద్ధి చెందుతాయి. పెద్దలు వ్యాయామం చేస్తే ఎముకలు బలపడతాయి. ప్రతి వారం 3–4 సార్లు, 30-40 నిమిషాలపాటు బరువుతో లేదా రిసిస్టెన్స్ వ్యాయామాలు చేయాలి. ఆస్టియోపోరోసిస్ ఉన్నవారు సమతుల్యం మరియు భంగిమ మెరుగుపరచే వ్యాయామాలు చేయాలి. ఫ్రాక్చర్ తర్వాత పునరుద్ధరణలో కూడా వ్యాయామం కీలకం – ఇది నొప్పి తగ్గించి, కదలిక మెరుగుపరుస్తుంది. ఫిజియోథెరపిస్ట్ సలహాతో వ్యాయామ ప్రణాళిక రూపొందించుకోవడం ఉత్తమం. ధూమపానం, మద్యం చేసే వారిలో ఎముకల కణజాలాన్ని దెబ్బతీస్తాయి.


