NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డేంజర్​… బ్యాక్టిరియా…!

1 min read

దంతాల బ్యాక్టిరియాతో.. హార్ట్​ ఎటాక్​ .. ?

  • నోటి నుంచి రక్త ప్రవాహంలో కలిసి… ఆపై  ధమనులు గట్టి పరిచి..
  •  గుండెకు రక్త సరఫరా నిలిపివేసే అవకాశాలు ఎక్కువ…
  • గుండెకు స్టంట్​ వేసిన చోటే … పుట్టలా పేరుకుపోతున్న బ్యాక్టిరియా..
  • దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధి ఉన్న వారికి …. ప్రాణహాని… ?
  • ధ్రువీకరించిన  నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH), అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్
  • నోటి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి
  • ప్రముఖ దంత వైద్య నిపుణులు

 హార్ట్​ ఎటాక్​ అనేది రక్తంలో కొలెస్ట్రాల్​ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వారికి  మాత్రమే వస్తుందని అందరికీ తెలుసు. కానీ దంతాల బ్యాక్టిరియాతోనూ గుండె నొప్పి వస్తుందని  కొందరికి మాత్రమే తెలుసు. అదీ వైద్య రంగంలో ఉన్న వారికి మాత్రమే . దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధితో వచ్చే ఇన్​ ఫెక్షన్​ వల్ల ప్రాణానికే హాని ఉందని,  నోటి పరిశుభ్రత హృదయ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందని సూచిస్తున్నారు దంత వైద్య నిపుణులు.

కర్నూలు హాస్పిటల్​ ​, న్యూస్​ నేడు:దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధిగ్రస్తుల్లో మంచి బ్యాక్టిరియా మృతి చెంది.. చెడు బ్యాక్టిరియా ఎక్కువగా  ఉంటుంది. అటువంటి వారు నమలడం మరియు బ్రష్ చేయడం వంటి సాధారణ కార్యకలాపాల ద్వారా రక్తప్రవాహంలోకి చెడు బ్యాక్టిరియా ప్రవేశించి, ధమనులను చేరుకుంటాయి. ధమనులలో బ్యాక్టిరియా పుట్టలా పేరుకుపోయి… రక్త సరఫరా నిలిపి… గుండె నొప్పికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH), అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వంటి ప్రమఖ ఆరోగ్య సంస్థలు చేసిన సర్వేలో తేలింది. కానీ బలమైన, ఖచ్చితమైన కారణం  కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.  

ధమనులలో… రక్త స్నిగ్ధత…

నోటి వ్యాధి కారకాలు ప్లాస్మా ఫైబ్రినోజెన్ వంటి కారకాలతో రక్త స్నిగ్ధతను పెంచుతుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.  అదేవిధంగా నోటి ఇన్ఫెక్షన్లు అథెరోస్క్లెరోసిస్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.  ఈ ప్రక్రియ ధమనులలో ఫలకం పేరుకుపోయి, వాటిని ఇరుకుగా చేసి గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. 

గుండెకు స్టంట్​ వేసిన… చోటే..

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది యువత గుండె పోటుతో మృతి చెందుతున్నారు. తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు  ఇలా అన్నీ కలుషితం కావడం ఒక కారణం కాగా… కొందరు మద్యం, సిగరేట్​ తాగడం, వ్యాయామం చేయకపోవడం… పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం, ఫాస్టు ఫుడ్​ కు అలవాటు పడటం.. తదితర కారణాలతో అనారోగ్యం పాలవుతున్నారు.  దంతాల ఇన్​పెక్షన్ నుంచి వచ్చే బ్యాక్టిరియా కూడా గుండె పోటుకు కారణమై ఉంటుందని ప్రముఖ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. గుండె నొప్పితో బాధ పడే వారికి స్టంట్​   వేసిన చోటే బ్యాక్టిరియా పేరుకుపోతుందని సర్వేలో పేర్కొంటున్నాయి.

దంతాలపై నిర్లక్ష్యం..

దంతాలు, దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధితో బాధ పడే వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. బ్రష్​ సరిగా చేయకపోవడం… సిగరేట్​ పీల్చడం, గుట్కా వేసుకోవడం. నశీము తీసుకోవడం వంటి కారణాలతో పంటి సమస్యలు తెచ్చుకుంటున్నారు.   కొందరు ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తీసుకున్న తరువాత  బ్రష్​ చేయడం,  రాత్రి సమయంలో  మాంసాహారం భుజించినప్పుడు పళ్లను శుభ్రం చేసుకోకుండా అలాగే నిద్ర పోవడం వల్ల దంత సమస్యల బారిన పడుతున్నారు.

నోటి ఆరోగ్యం.. ముఖ్యం

దంత సమస్యలు.. దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధితో బాధ పడే వారు ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకోవాలి. లేదంటే దంతాల ఇన్​ ఫెక్షన్​ రక్తంలోకి ప్రవేశిస్తుంది. తరువాత ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. అధికంగా పొగ పీల్చే వారు…మధుమేహం ఉన్న వారికి దంతాల సమస్య ఎక్కువగా ఉంటుంది. దంతాలపై నిర్లక్ష్యం వహించొద్దు. నోటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.

డా. సునీల్​ కుమార్​ రెడ్డి, దంత వైద్య నిపుణులు, శ్రీ సాయి డెంటల్​ క్లినిక్​

 సమన్వయంతో.. చికిత్స…

గుండెకు స్టంట్​ వేసుకున్న వారు, హృదయ సంబంధిత వ్యాధులతో బాధ పడే వారు దంతాల సమస్యతో వస్తే… వారికి కార్డియాలజిస్టు వైద్యులు సూచించిన మెడిసిన్​ ఇచ్చిన తరువాత చికిత్స చేస్తాము. మధుమేహం ఎక్కువగా ఉన్న వారికి తగ్గిన తరువాతే చికిత్స ప్రారంభిస్తాము. దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధితో బాధపడే వారిలో బ్యాక్టిరియా  గుండెకు రక్త సరఫరా చేసే ధమనులలో చేరుకుంటుంది. కానీ హార్ట్​ ఎటాక్​ కు పూర్తి స్థాయి కారణం ఇదే నని చెప్పలేము.  ఏదైనా కావచ్చు. పళ్లను శుభ్రంగా ఉంచుకుంటే మంచిది.

డా. విజయ కుమార్​, దంతాల వైద్య నిపుణులు, జీజీహెచ్​ హెచ్​ ఓడి

చెడు బ్యాక్టిరియాతో… హార్ట్​ ఎటాక్​..

  • శరీరంలో ఎక్కడ ఇన్​ ఫెక్షన్​ అయినా చెడు బ్యాక్టిరియా రక్తనాళాల్లోకి వెళ్లేందుకు సమయం పడుతుంది. కానీ నోటిలో ఇన్​ ఫెక్షన్​ అయితే… వేగంగా రక్తనాళాల్లోకి వెళ్తుంది. అప్పుడు రక్తనాళాల  సైజు తగ్గి… సరఫరా నిలిపేస్తుంది. దీని వల్ల హార్ట్​ ఎటాక్​ వచ్చే అవకాశం ఉంటుంది.  అందుకే హృదయ సంబంధిత వ్యాధితో చికిత్స కోసం వచ్చిన వారికి … సోర్బిట్రేట్​ టాబ్లెట్​ నాలుక కింద పెట్టి… కొన్ని గంటల తరువాత చికిత్స చేస్తాము.

డా. రాఘవేంద్ర చెరుకూరి, డి.ఎం., కార్డియాలజి, జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​

About Author