చంద్రబాబు రెండేళ్ల పాలన అంతా మోసం, నయవంచన, దగా: ఎమ్మెల్యే
1 min read
అబద్ధానికి, వెన్నుపోటుకు చొక్కా ప్యాంట్ వేస్తే చంద్రబాబే: వైకుంఠం మల్లికార్జున చౌదరి
చంద్రబాబు పాలన అంతా లీకులమయం: పరిశీలకులు రామచంద్రారెడ్డి
అంబేద్కర్ సర్కిల్ నుంచి చెక్‌పోస్ట్ వరకు వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ
ఆలూరు న్యూస్ నేడు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న “చంద్రబాబు అహంకార, మోసపు పాలనకు రెండేళ్లు” నిరసన కార్యక్రమంలో భాగం గా ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు రామచంద్రారెడ్డి, వైకుంఠం మల్లికార్జున చౌదరి నాయకత్వం వహించారు.అంబేద్కర్ సర్కిల్ నుండి చెక్‌పోస్ట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన తొలి ఐదు సంతకాలే ప్రజలను మోసం చేసే చర్యలుగా మారాయని విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో భారీ ప్రచారం చేసినప్పటికీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన 6,100 పోస్టులను రద్దు చేసి నియామకాలను ఆలస్యం చేశారని ఆరోపించారు. ఆ పోస్టులను కలిపి 16 వేల పోస్టులకు మెగా డీఎస్సీ అని పేరు పెట్టి చివరకు లీకులు, అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు.రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, చంద్రబాబే లాయర్, చంద్రబాబే ఆదేశాలు ఇచ్చే వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేశారని విమర్శించారు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు సహా ప్రతి వర్గానికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, ప్రతి గ్రామంలో మార్పు ప్రారంభమైందని తెలిపారు.వైకుంఠం మల్లికార్జున చౌదరి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల ద్వారా 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలను కేవలం నాలుగు నెలల్లో పారదర్శకంగా భర్తీ చేసి చరిత్ర సృష్టించామని అన్నారు. 19 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసినా ఒక్క తప్పు కూడా జరగకుండా నియామకాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మెగా డీఎస్సీ పేరుతో నిర్వహిస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ప్రశ్నాపత్రాల భద్రత, డిజిటల్ నిర్వహణ వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.పార్టీ పరిశీలకులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. సూపర్-6, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు నిండిన మహిళలకు పెన్షన్ వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని అన్నారు.ఈ భారీ నిరసన కార్యక్రమంలో ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, హోళగుంద, హాలహర్వీ, చిప్పగిరి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు, రాష్ట్ర మరియు జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్ మరియు బీవీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



