NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవం… నిమజ్జనోత్సవం..

1 min read

కర్నూల్ లో ముగిసిన వినాయక నిమజ్జనం

హంద్రీనీవాలో 1,050 విగ్రహాల నిమజ్జనం

కర్నూలు వినాయక ఘాట్‌లో 1,000కు పైగా విగ్రహాలు

ఉలిందకొండలో 96 విగ్రహాల నిమజ్జనం

భక్తులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు

కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా, ప్రశాంతంగా ముగిశాయి. నగరంలోని వినాయక ఘాట్‌తో పాటు కర్నూలు నగర శివారులోని నన్నూరు టోల్‌ప్లాజా వద్ద హంద్రీనీవా, ఉలిందకొండ వద్ద కూడా పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి తరలివచ్చిన భక్తులతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి.కర్నూలు జిల్లాలో నీటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వినాయక నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రి టీజీ భరత్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హంద్రీనీవాలో నీటి లభ్యతను పరిశీలించి అక్కడ కూడా నిమజ్జనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ముందస్తు ప్రణాళికతో నిమజ్జన ఏర్పాట్లు చేపట్టారు.

ర్ధరాత్రి తర్వాత పెరిగిన భక్తుల రద్దీ

అర్ధరాత్రి దాటిన తర్వాత హంద్రీనీవా వద్ద వినాయక విగ్రహాల రాక మరింత పెరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ గణనాథులను ఊరేగింపుగా తీసుకొచ్చిన భక్తులు హంద్రీనీవాలో నిమజ్జనం చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలో సందడి నెలకొంది. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో నిమజ్జన కార్యక్రమానికి తరలివచ్చారు. భారీ విగ్రహాలతో వాహనాలు వరుసగా రావడంతో హైవేపై వినాయక విగ్రహాలు బారులు తీరాయి. అధికారులు, పోలీసులు సమన్వయంతో ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

మూడు ప్రాంతాల్లో భారీగా నిమజ్జనం..

నన్నూరు టోల్‌ప్లాజా వద్ద హంద్రీనీవాలో 1,050 వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. కర్నూలు నగరంలోని వినాయక ఘాట్‌ వద్ద కేసీ కెనాల్‌లో 1,000 వరకు విగ్రహాలు నిమజ్జనం చేశారు. అలాగే ఉలిందకొండ వద్ద 96 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. హంద్రీనీవాలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. అర్ధరాత్రి తర్వాత విగ్రహాల రాక పెరిగింది. భారీ సంఖ్యలో విగ్రహాలు తరలివచ్చినప్పటికీ ముందస్తు ఏర్పాట్ల కారణంగా నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగింది.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు.నీటి కొరత ఉన్న పరిస్థితుల్లోనూ ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలను సిద్ధం చేయడం ద్వారా భక్తులకు సౌకర్యం కల్పించారు. హంద్రీనీవా, కేసీ కెనాల్‌, ఉలిందకొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జన సదుపాయాలను భక్తులు వినియోగించుకున్నారు.మొత్తంగా కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. అధికారులు, పోలీసులు, వివిధ శాఖల సిబ్బంది సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *