ఎల్ నినో ప్రభావంతో ఏర్పడుతున్న వాతావరణ మార్పులు
1 min read
తక్కువ వర్షపాతo,అధిక ఉష్ణోగ్రతలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం
ప్రకృతి వ్యవసాయ విధానంలో నవధాన్యాల సాగు ఎంతో మేలు చేస్తుందనే అంశంపై రైతులకు రైతులకు అవగాహన కలిగించాలి
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
అవగాహన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఎల్ నినో ప్రభావంతో ఏర్పడుతున్న వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో నవధాన్యాల సాగు ఎంతో మేలు చేస్తుందనే అంశంపై రైతులకు రైతులకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఎల్నినో తీవ్ర ప్రభావం – ప్రకృతి సాగు ఆవశ్యకత పై అవగాహన కరపత్రాన్ని శనివారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ నవధాన్యాల సాగు ద్వారా వర్షాభావ పరిస్థితులను తట్టుకునే శక్తి పెరుగుతుందని, తక్కువ నీటితోనే సాగు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అలాగే భూసారం మెరుగుపడటంతో పాటు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గి రైతుల సాగు ఖర్చులు తగ్గుతాయని, తక్కువ పెట్టుబడులతో మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు. పశువులకు నాణ్యమైన మేత అందడంతో పాటు కుటుంబాలకు పోషకాహారం కూడా లభిస్తుందని వివరించారు. ఏలూరు జిల్లాలో 83,538 మంది రైతులతో 1,00,548 ఎకరాల్లో నవధాన్యాల సాగు లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటివరకు 35,767 మంది రైతులు 36,449 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేపట్టారని, రాబోయే రోజుల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని కూడా పూర్తిచేయాలని కలెక్టర్ వ్యవసాయాధికారులు ఆదేశించారు. ఎల్నినో తీవ్ర ప్రభావం-ప్రకృతి సాగు ఆవశ్యకత పై గ్రామాలలోని ప్రతీ రైతుకు అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కె. హబీబ్ బాషా, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్, మండల వ్యవసాయ అధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

