బ్లాక్ స్పాట్‌ను అందంగా తీర్చిదిద్దడంపై కమిషనర్ ప్రశంసలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం నగరంలోని చెన్నమ్మ సర్కిల్ నుండి ముజఫర్ నగర్ వెళ్లే రహదారిలో ఉన్న ఒక బ్లాక్ స్పాట్‌ను అందంగా తీర్చిదిద్దడంపై నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్థానిక ఇంచార్జి శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎంజల్ ప్రణీతను అభినందించారు. బ్లాక్ స్పాట్ వద్ద కంచె ఏర్పాటు చేసి, మొక్కలు, బల్లలు, స్వచ్ఛ సర్వేక్షన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు, సూచనల బ్యానర్లు, అలాగే నీడ కోసం గ్రీన్ షెడ్లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించారు. దీంతో బుధవారం అక్కడికి వెళ్లిన కమిషనర్ ‘శభాష్ అమ్మా!’ అంటూ ఎంజల్ ప్రణీతకు కితాబిచ్చారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పర్యవేక్షక యంత్రాంగం బ్లాక్ స్పాట్‌ను తీర్చిదిద్దిన విధానాన్ని స్పూర్తిగా తీసుకుని, ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్లు స్వీయ నిర్ణయాలతో తనదైన శైలిలో పనితీరు కనబరచాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని, బాగా పనిచేసే వారికి ప్రోత్సహిస్తామని తెలిపారు.కాగా అంతకుముందు కమిషనర్ కల్లూరు ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో, బుధవారపేటలో పారిశుద్ధ్య తనిఖీలు నిర్వహించారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘ తదితరులు పాల్గొన్నారు.

