సమాచార కమిషన్లు పూర్తిగా స్వతంత్రంగా పనిచేసేలా చట్టం చేయాలి
1 min read
ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ ఆర్ కే డేవిడ్
విజయవాడ, న్యూస్ నేడు: సమాచార కమిషన్లు పూర్తిగా స్వతంత్రంగా పనిచేసేలా చట్టం చేయాలని ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ ఆర్ కే డేవిడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశంలో పాలన పారదర్శకంగా కొనసాగాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎటువంటి దాపరికం ఉండకూడదన్నారు. ఎన్నో పోరాటాలు ఫలితంగా ఆర్.టి.ఐ చట్టం వచ్చిందని వెల్లడించారు. ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం శనివారం గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశంలో ప్రజా ఉద్యమ సంస్థలు, విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, మేధావులు, సమాచార హక్కు చట్టం మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. ఆర్. కె. డేవిడ్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాల వల్ల సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు. సమాచార హక్కు చట్టాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్.టి.ఐ ప్రకారం కోరిన సమాచారాన్ని ఖచ్చితమైన నిర్దేశించిన సమయానికి ఇవ్వాలన్నారు. ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారం కాకుండా ఉండాలన్నారు. సమాచారం కోరిన వ్యక్తులపై దాడులు అక్రమ కేసులు ఉండకూడదన్నారు. సమాచార కమిషన్లు పూర్తిగా స్వతంత్రంగా పనిచేసేలా చట్టంలో మార్పులు చేయాలన్నారు. సమాచారాన్ని పొందడం మరింత సులభతరం చేయడానికి ఆన్లైన్ ప్లాట్ఫారం లను మెరుగుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు పర్వతనేని హరికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పి రవికుమార్, గౌరవ అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు, అడ్వకేట్ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.