నష్టపోయిన మినుము రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
1 min read
కొత్తూరులో మినుము రైతులు ఆందోళన
పంట నష్టాలు పరిశీలించిన రైతు సంఘం నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన మినుము రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పెదపాడు మండలంలోని కొత్తూరు, కొత్తముప్పరు గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పర్యటించి నీట మునిగిన మినుము పంటను పరిశీలించారు. చనిపోయే దశలో ఉన్న మినుము పంటతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం ఉందని కృష్ణా డెల్టాలో వరి పంట వేయవద్దు ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం,వ్యవసాయ అధికారులు సూచనలతో రైతులు మినుము పంట సాగు చేశారని చెప్పారు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంతో మరో అవకాశం లేక రైతులు ఆరుపడి పంటలు సాగు చేశారని చెప్పారు. ఎల్ నినో తీవ్రత తగ్గి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోలేదని, వర్షాలు వస్తే ఆరుతడి పంటలు దెబ్బతింటాయని రైతులు ఎంత చెప్పినా పెడచెవిన పెట్టారని, ఇప్పుడు ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా వర్షాలు కురిసి మినుముపంట నీట మునిగినా ఇంతవరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయలేదని, రైతులను పలకరించిన పరిస్థితి లేదని విమర్శించారు. భారీ వర్షాలకు మినుము పంటతో పాటు జిల్లాలో వరి, అరటి, కూరగాయలు, ఆయిల్ పామ్ తదితర పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. పంట నష్టాలను వెంటనే నమోదు చేయాలని కోరారు. పంటలు నష్టపోయిన రైతులకు,కౌలు రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, పంటల బీమా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.మినుము పంట నష్టపోయిన చెడుగొండి శ్రీనివాసరావు మాట్లాడుతూ వరి పంట సాగు కోసం ముందుగా నారుమడి వేసి నీరు అందక ఎండిపోయే నష్టపోయానని, అధికారుల సూచనలు మేరకు మినుము పంట వేసి అధిక వరకు వర్షాలకు నష్టపోయానని పది ఎకరాల సాగులో దాదాపు రూ.3లక్షల వరకు నష్టపోయినని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మినుము రైతులు పాల్గొన్నారు.


