దక్షిణాసియా ‘ ట్రెడిషనల్ ఆర్చరీ ’ విజేతలకు మంత్రి అభినందన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: దక్షిణాసియా ట్రెడిషనల్ ఆర్చరీ పోటీలలో విజేతలుగా నిలిచిన జ్ఞాని ఆర్చరీ అకాడమీ క్రీడాకారులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. ఇటీవల నిర్వహించిన సౌత్ ఏషియన్ ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనబరచి పతకాలు సాధించిన యువ క్రీడాకారులను ఆయన ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ దేశానికి కీర్తి తీసుకువస్తున్న విద్యార్థులను ప్రశంసించారు. అండర్-12 విభాగంలో విజేతగా నిలిచిన నంది రెడ్డి గుణీత్ రెడ్డి, అండర్-8 విభాగంలో విజయం సాధించిన నంది రెడ్డి రియాంచ్ రెడ్డి, అండర్-10 విభాగంలో గెలుపొందిన వై. విమల్ కుమార్‌లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రీడాకారులు భవిష్యత్తులో మరింత కృషి చేసి ఇంకా ఎక్కువ పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారత దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విజేతలను తీర్చిదిద్దడంలో విశేష కృషి చేసిన కోచ్ వజ్రరాజు ను మంత్రి అభినందించారు.

