వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించే వైద్యులు, సిబ్బంది ని సస్పెండ్ చేస్తా
1 min read

వైద్య సేవల్లో అలసత్వం వద్దు, ప్రసూతి, లేబర్ వార్డులలో సిసి కెమెరాలతో పటిష్ట నిఘా
నూజివీడు ఏరియాను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ప్రతీ వార్డును, ప్రతీ వైద్య విభాగాన్ని తనిఖీ చేసి,రోగులను ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్న కలెక్టర్
వైద్యులు, సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోకపోతే కఠిన చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్ హెచ్చరిక
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడునిరుపేదల వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించే వైద్యులు, వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రతీ వార్డు, ప్రతీ వైద్య విభాగం ను పరిశీలించి, రోగులను ఆసుపత్రిలో సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఓ. పి . విభాగంలో రోగులకు సక్రమంగా వైద్య సేవలందించక పోవడం, ఆసుపత్రిలో ఆపారిశుద్ధ్యం, సిసి కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం, రోగుల రద్దీని నియంత్రించకపోవడం, ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది నిర్లక్ష్యం వంటి వాటిని పరిశీలించి ఆసుపత్రిలో సేవలు పర్యవేక్షించే వైద్యాధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ ఆశయాల మేరకు వైద్య సిబ్బంది పనిచేయాలని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు స్వాంతన చేకూరే విధంగా వైద్యులు చికిత్స అందించాలని, రోగులు ఎక్కువ సమయం వేచిఉండకుండా త్వరితగతిన చికిత్స అందించాలన్నారు. రోగులపట్ల సేవలోపం, విధుల పట్ల నిర్లప్తత ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తాను ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తానని, ఎక్కడైనా వైద్య సిబ్బంది సేవాలోపం గుర్తిస్తే వెంటనే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానన్నారు. ప్రసూతి, లేబర్ వార్డులలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రిలో గడువు తీరిన మందులను, బయో మెడికల్ వెస్ట్ ను నిర్దేశించిన ప్రమాణాలతో నిర్మూలించాలన్నారు. ఆసుపత్రిలోని, పరిసరాలలో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. కలెక్టర్ వెంట నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిసిహెచ్ ఎస్ డా పాల్ సతీష్, ఆసుపత్రి ఆర్.ఎం.ఓ శ్రీనివాస్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబెర్ కామేష్, తహసీల్దారు, ప్రభృతులు పాల్గొన్నారు.


