టీటీడీ గోశాలపై అసత్య ప్రచారాలు చేయొద్దు..
1 min read
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు: కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడటం తగదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. ఆవుల మరణాలపై భూమన వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి టి.జి భరత్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తితిదే పవిత్రతను కాపాడేందుకు ఎన్డీయే ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అవాస్తవాలను ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. గోశాలలోని ఆవులు వృద్ధాప్యం, డెలివరీ సమయంలో, వ్యాధులతో నెలకు సగటున 10 ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయన్నారు. ఇది గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే స్పష్టంగా తెలుస్తుందన్నారు. టీటీడీ గోశాలలో 260 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణను సక్రమంగా చూసుకుంటున్నారని పేర్కొన్నారు. కోటిమంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కుట్రలు చేయొద్దని వైసీపీ నేతలకు మంత్రి హితవు పలికారు.