NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పలు పాఠశాలలను సందర్శించిన ఏలూరు ఎమ్మెల్యే

1 min read

విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం పై సంతృప్తి

విద్యార్థులు కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

విద్యా వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది

 ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  :విద్యావ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ముందుకెళ్తోన్న కూటమి ప్రభుత్వం విద్యార్ధులకు అనేక పథకాలను పటిష్టవంతంగా అమలు చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. ఏలూరులోని పలు పాఠశాలలను  ఎమ్మెల్యే బడేటి చంటి బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సందర్శించారు. తొలుత స్థానిక 12పంపుల సెంటర్‌లోని గాంధీనగర్‌ – నగరపాలకోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఆయన అక్కడ కొనసాగుతోన్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. స్వయంగా విద్యార్ధులకు ఆహారపదార్ధాలను వడ్డించారు. అలాగే స్కూల్‌ హెచ్‌ఎం జి. సునీతతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి విద్యార్ధులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేయాలని సూచించారు. అలాగే విద్యార్ధులతో భోజన సమయంలోనే మాట్లాడీ, ఆహారం ఎలా ఉందంటూ ప్రశ్నించగా దానికి విద్యార్ధులంతా రుచికరంగానే ఉందంటూ సమాధానం ఇచ్చారు. అనంతరం ఏలూరు ఆర్‌ఆర్‌ పేటలోని ఈదర సుబ్బమ్మ దేవి నగరపాలకొన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరులో లోటుపాట్లు ఉన్నాయంటూ తనకు సామాజిక మాద్యమం ద్వారా అందిన ఫిర్యాదుపై స్పందించీ, ఆ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి, అక్కడ కూడా మిడ్డే మీల్స్‌ స్కీమ్‌ అమలు తీరును పరిశీలించారు. స్వయంగా విద్యార్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. స్కూల్‌ హెచ్‌ఎం పి. కుటుంబరావుతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఈ రెండు పాఠశాలల్లో కూడా భోజనం రుచికరంగా ఉందని విద్యార్ధులే చెబుతున్నారన్నారు. ఫిర్యాదు మేరకు తానే స్వయంగా ఆహారపదార్ధాలను రుచిచూశానన్నారు. సన్నబియ్యంతో భోజన పథకాన్ని అమలు చేయడం ప్రారంభమైన నాటినుండి క్రమంగా పాఠశాలల్లో భోజనం చేసే విద్యార్ధుల శాతం పెరిగిందని, అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సాహించాలని సూచించారు. నూరుశాతం విద్యార్ధులు ఈ పథకంతో కడుపునిండా భోజనం చేయాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యానికి సాకారం అందించాలని ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author