ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు : మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వ్యాపార రంగంలో స్థిరపడితే మరి కొంతమంది మహిళలకు ఉపాధినిచ్చే అవకాశాలుంటాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన చిరు వ్యాపారుల ప్రదర్శన, విక్రయ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూమహిళల్లో ఉన్న తపన, శక్తితో పాటు నైపుణ్యం తోడైతే పారిశ్రామికంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సొసైటీలో మహిళలు వారికి ఉన్న భాదాలను అధిగమించి విజయాలు సాధించిన వారున్నారన్నారు. సమస్యల్లో ఉన్న మహిళలను స్వశక్తితో పైకి రావడానికి చేయూతను ఇవ్వాలన్నారు. పట్టణంలోని మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తద్వారా మరి కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. మహిళా చిరు పారిశ్రామిక వేత్తలు ఎంతో నాణ్యతతో ఉత్పత్తులను తయారు చేసి చక్కటి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి చేపట్టిన వృత్తిని లాభదాయకంగా మార్చుకొని మరి కొంత మందికి ఉపాధి కల్పించడం చాలా సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి లీలావతి, పరిశ్రమల శాఖ జిఎం జవహర్ బాబు, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మెప్మా పిడి నాగ శివలీల తదితరులు పాల్గొన్నారు.
