ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్
1 min read
ఘాట్ రోడ్డు, నూతన పూజా మండపం, కొత్త లడ్డూ పోటు భవనాల నిశిత తనిఖీ
మల్లేశ్వరస్వామి ఆలయ నిష్క్రమణ మెట్ల మార్గం పరిశీలన
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆదేశాలు
పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి స్పష్టం
ఇంద్రకీలాద్రి, న్యూస్ నేడు: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుండి ప్రారంభం కానున్న శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ సోమవారం ఉదయం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్‌తో కలిసి ఆయన కొండపైన, కొండ దిగువన జరుగుతున్న వివిధ అభివృద్ధి, నిర్వహణ పనులను నిశితంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఘాట్ రోడ్డు మార్గం, ఇటీవల కొండచరియలు పడిన ప్రాంతాల్లో చేపట్టిన రక్షణ చర్యలు, దసరా రోజుల్లో విశేష సేవలు నిర్వహించే నూతన పూజా మండపం, త్వరలో ప్రారంభం కానున్న నూతన లడ్డూ పోటు భవనం మరియు ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. భక్తులు శ్రీ అమ్మవారి దర్శనం ముగించుకుని కొండ దిగువకు వెళ్లే శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయ మెట్ల మార్గాన్ని (ఎగ్జిట్ రూట్) పరిశీలించి, రద్దీ సమయంలో భక్తులకు ఎలాంటి తోపులాటలు, ఇబ్బందులు కలగకుండా తగిన బారికేడింగ్, రక్షణ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దసరా మహోత్సవాలకు సుమారు 25 లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశమున్నందున, ఇంజినీరింగ్ అధికారులు ఎటువంటి జాప్యం లేకుండా అన్ని నిర్మాణ, మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ రామచంద్ర మోహన్ ఆదేశించారు. భక్తుల భద్రత, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్,ఇంజినీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు.


