ఎల్ నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి …జిల్లా కలెక్టర్
1 min read
రైతు రిజిస్ట్రీ నమోదు ప్రభుత్వ పథకాలకు తప్పనిసరి
తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి
డిజిటల్ యాప్స్ ద్వారా ఎరువుల పంపిణీపై వట్లూరు రైతులతో కలెక్టర్ సమీక్ష
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు ‘ఎల్ నినో’ ప్రభావంపై రైతులు ముందస్తుగా అప్రమత్తం కావాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి పిలుపునిచ్చారు. వట్లూరు గ్రామంలోని సోమవారం రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో వ్యవసాయ అభివృద్ధి,రైతు సంక్షేమం,సుస్థిర వ్యవసాయంపై ఆమె సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాలో వ్యవసాయ ప్రగతికి, రైతులకు అందాల్సిన ప్రభుత్వ సేవలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ‘రైతు రిజిస్ట్రీ’ నమోదు చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దీని ద్వారానే వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ, విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు ప్రభుత్వ అధికారిక వ్యవసాయ సేవలు, సలహాలలో ప్రాధాన్యత లభిస్తుందన్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ‘ఎల్ నినో’ పరిస్థితుల కారణంగా వర్షపాతం తగ్గే ముప్పు ఉందని కలెక్టర్ హెచ్చరించారు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలన్నారు. పొలాల్లో నీటి ఎద్దడి రాకుండా డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటి సాగు (మైక్రో ఇరిగేషన్) పద్ధతులను పాటించాలని, అలాగే వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు పొలాల్లో ‘ఫార్మ్ పాండ్స్’ (పంట సంజీవని కుంటలు) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కువ నీటి వినియోగం అయ్యే వరి సాగు స్థానంలో తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్నిచ్చే చిరుధాన్యాలు (మిల్లెట్స్), మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ కోరారు. పంట మార్పిడి ద్వారా భూమి సారం పెరగడమే కాకుండా, రైతులకు స్థిరమైన ఆర్థిక భద్రత, అధిక ఆదాయం లభిస్తుందన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా సరికొత్త డిజిటల్ విధానాన్ని తీసుకువచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఆపైమ్స్ 2.0 యాప్ ద్వారా RSK ఇన్‌ఛార్జ్‌లు నమోదు చేసిన పంట విస్తీర్ణం ఆధారంగా రైతులకు కావలసిన యూరియా, డీఏపీ ఎరువులను కేటాయిస్తారని,రైతులు తమ మొబైల్‌కు వచ్చే ఓటీపీ విధానం ద్వారా ఎంతో సులభంగా, పూర్తి పారదర్శకంగా ఎరువులను కొనుగోలు చేయవచ్చన్నారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, పెదపాడు తహసీల్దార్ కృష్ణ జ్యోతి, పెదపాడు ఎంపిడిఓ ఆమిల్ జమ్మద్,అగ్రికల్చర్ ఏ ఓ షేక్ ఇమామి ఖాసీం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

