ఎమ్మిగనూరులో వినాయక నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
1 min read
ఎల్ఎల్సీ కాలువ వద్ద నిమజ్జన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో వినాయక నిమజ్జన మహోత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన భద్రతా ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఎల్ఎల్సీ కాలువ వద్ద వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. నిమజ్జన ఊరేగింపు సాగే ప్రధాన మార్గాలు, సున్నిత ప్రాంతాలు, నిమజ్జన ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తును తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఊరేగింపు మార్గాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.వినాయక నిమజ్జన బందోబస్తు విధుల్లో ట్రైనీ కానిస్టేబుళ్లు కూడా చురుగ్గా పాల్గొన్నారు.శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ట్రైనీ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ గారు పలు కీలక సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు.శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.ఈ పరిశీలన సందర్భంగా జిల్లా ఎస్పీ తో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, డీఎస్పీ ఉపేంద్ర బాబు, సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


