ఫోరెన్సిక్ పై అవగాహన పెంచుకోండి..
1 min read
నర్సింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
- కేఎంసీ వైస్ ప్రిన్సిపల్ డా. సాయి సుధీర్
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు: నర్సింగ్ విద్యార్థులు ఫోరెన్సిక్ పై అవగాహన పెంచుకుంటూ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని కర్నూలు మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపల్ డా. సాయి సుధీర్ అన్నారు. స్థానిక ఏ క్యాంపులోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఛాంబరులో ఫౌండేషన్ ప్రధాన సెక్రటరి, ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ నేతృత్వంలో నర్సింగ్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఫోరెన్సిక్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన కేఎంసీ వైస్ ప్రిన్సిపల్ డా. సాయి సుధీర్ మాట్లాడుతూ అత్యవసర కేసులు, రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలు , వృద్ధులు, వితంతువులపై దాడులు తదితర కేసులకు సంబంధించి డాక్టర్లతోపాటు నర్సులు కూడా అవసరమైతే కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆదేశానుసారం నర్సింగ్ కోర్సులు మూడో సంవత్సరం చదువుతున్న వారికి ఫోరెన్సిక్ కోర్సు కూడా చేర్చుతారన్నారు. ఫోరెన్సిక్ కోర్సును చేర్చడం వల్ల నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని,ఆ కోర్సు టీచర్లు, సిబ్బందిని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమిస్తుందన్నారు. భవిష్యత్ లో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేఎంసీ వైస్ ప్రిన్సిపల్ డా. సాయి సుధీర్ నర్సింగ్ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో హార్ట్హెల్త్ క్లబ్ గౌరవాధ్యక్షులు చంద్ర శేఖర్ కల్కూర, డా. భవాని ప్రసాద్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



