నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ లో భాగంగా పేదరిక నిర్మూలనకు పి-4 (ప్రభుత్వ- ప్రైవేటు- ప్రజల భాగస్వామ్య) విధానంతో నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి నియోజకవర్గ, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ లో భాగంగా నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. జీరో పావర్టీ, ఉద్యోగాల సృష్టి, నైపుణ్యత పెంపు, రైతు సాధికారత, త్రాగునీటి రక్షణ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్వచ్ఛ ఏపీ, మానవ వనరుల వినియోగం, శక్తి వనరుల నిర్వహణ, సాంకేతిక జ్ఞానం పెంపు తదితర పది సూత్రాల అనుసంధానంతో నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. పి-4 విధానంపై ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని మండల తాసిల్దారులను, ఎంపీడీవో లను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి వేణుగోపాల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికపై వివరించారు.