షైనింగ్ స్టార్స్ పథకానికి హోళగుంద మండలంలోని నలుగురు విద్యార్థుల ఎంపిక
1 min read
ఎస్ఎస్సీ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం
హోళగుంద న్యూస్ నేడు: ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించి, వారి ఉన్నత విద్యాభ్యాసానికి మరింత ఉత్సాహం కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “షైనింగ్ స్టార్స్” పేరుతో వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి హోళగుంద మండలంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి నలుగురు విద్యార్థులు ఎంపిక కావడం మండలానికి గర్వకారణమని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారులు డా. సుధారాణి మరియు పీ. కబీర్ షాబ్ మాట్లాడుతూ, హోళగుంద మండలంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థుల వివరాలను వెల్లడించారు.
ఎంపికైన విద్యార్థులు:
జెడ్పీహెచ్ఎస్ హోళగుందకు చెందిన షేక్ మహమ్మద్ సక్లేన్ (బీసీ-ఈ) – 582/600 మార్కులు
జెడ్పీహెచ్ఎస్ హోళగుందకు చెందిన సింగం ప్రియాంక (ఓసీ) – 568/600 మార్కులు
జెడ్పీహెచ్ఎస్ ఇంగళదహళ్కు చెందిన కె. నాగ చైతన్య (బీసీ) – 580/600 మార్కులు
జెడ్పీహెచ్ఎస్ సులువాయికి చెందిన హరిజన అనితమ్మ (ఎస్సీ) – 541/600 మార్కులు
ఈ నలుగురు విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షైనింగ్ స్టార్స్ పథకానికి ఎంపిక కావడం పట్ల మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా కృషి, పట్టుదలతో అత్యున్నత విజయాలు సాధించగలరని ఈ ఎంపిక మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు.అలాగే, షైనింగ్ స్టార్స్ పథకానికి ఎంపికైన విద్యార్థులు సోమవారం (20-07-2026) కర్నూలులో నిర్వహించనున్న ప్రత్యేక అభినందన సభకు తప్పనిసరిగా హాజరుకావాలని మండల విద్యాధికారులు సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.



