ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పోలీసులకు ఉచిత వైద్య పరీక్షలు
1 min read

హైదరాబాద్, న్యూస్ నేడు: నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అంబర్‌పేటలోని జిల్లా పోలీసు ఆస్పత్రిలో పోలీసు సిబ్బంది కోసం ఒక మల్టీ స్పెషాలిటీ వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ శిబిరాన్ని కమాండెంట్ ఎస్.మోహన్‌రావు, అసిస్టెంట్ కమాండెంట్ కె.వి.ఎస్.ఎన్. పరమేశ్వరరావు ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి సాధారణంగా ఉండే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం, ముందుజాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం గురించి సిబ్బంది అందరిలో అవగాహన కల్పించేందుకు ఈ శిబిరాన్ని నిర్వహించారు. పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై, తమ ఆరోగ్యానికి సంబంధించిన పలు రకాల పరీక్షలు చేయించుకున్నారు. ప్రజల రక్షణలో నిరంతరం నిమగ్నం అయి ఉంటూ తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పనిచేసే పోలీసుల పట్ల తమకున్న బాధ్యతను నెరవేర్చడంలో ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నిబద్ధతను ఈ శిబిరం చాటిచెప్పింది.

