NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీ సేవల వినియోగంతోనే తల్లి, బిడ్డలకు ఆరోగ్యం

1 min read

ఆదోని, న్యూస్ టుడే:  గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల సమగ్ర ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పౌష్టికాహార పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయని టీడీపీ  జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ‘సేవా సంకల్పం అభియాన్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదోని పట్టణ పరిధిలోని మండగిరి, ఇంద్రనగర్ అంగన్వాడీ కేంద్రాల్లో “అంగన్వాడీ ఉత్సవం – పౌష్టికాహారం మరియు ఆరోగ్య అవగాహన కార్యక్రమం” ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణమ్మ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలనూ, పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సరైన సమయంలో పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉంటారని, చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతినెలా గర్భిణులు, బాలింతలకు అందజేసే టేక్ హోమ్ రేషన్ వివరాలను ఈ సందర్భంగా వివరించారు. ప్రతి నెలా ప్రతి ఒక్కరికీ 3 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 450 గ్రాముల నూనె, 13 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు అందజేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు రోజువారీ పంపిణీలో భాగంగా కోడిగుడ్లు, పాలు క్రమం తప్పకుండా అర్హులందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా ప్రసవ పూర్వ వైద్య పరీక్షలు  చేయించుకోవాలని, బాలింతలు ప్రసవానంతర ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. చిన్నారులకు నిర్ణీత సమయాల్లో టీకాలు వేయించడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల బారి నుంచి రక్షణ లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సీడీపీవో లోకేశ్వరి, సూపర్‌వైజర్ భార్గవి, అంగన్వాడీ టీచర్ హైమవతి, ఎన్డీయే కూటమి నాయకులు,  మురళి, బాబురావు, బెస్త ఓంకార్, దేవేంద్ర, ఉపేంద్ర, అబ్దుల్, రేవన్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *