NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

1 min read

భక్తుల సౌకర్యార్థం ఉదయం 11 గంటల నుండి అంతరాలయ దర్శనాలు నిలుపుదల

  • రద్దీని క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించిన ఈవో  వి.కె. శీనా నాయక్

​ఇంద్రకీలాద్రి, న్యూస్​ నేడు: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.  ఆదివారం సెలవు రోజు కావడంతో .. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో క్యూలైన్లు, ప్రధాన ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి.  ​భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో వేచి ఉండే సామాన్య భక్తులకు శీఘ్రగతిన అమ్మవారి దివ్య దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం 11:00 గంటల నుండి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేసి, మధ్యాహ్నం వరకు లఘు దర్శనాలను మాత్రమే కొనసాగించారు.  ​దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి క్యూలైన్లు పరిశీలించారు.  భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆలయ అధికారులకు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు వినియోగించే లిఫ్టుల వద్ద భక్తుల రద్దీ పెరగడంతో, అక్కడ తోపులాటలు జరగకుండా భద్రతా సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి రాకపోకలను క్రమబద్ధీకరించారు.  ​ఆదివారం పురస్కరించుకుని ఆలయంలో సంప్రదాయబద్ధంగా విశేష “సూర్యోపాసన సేవ” నిర్వహించారు. ఆర్జిత సేవలు జరిగే అన్ని ప్రాంగణాల్లోనూ భక్తుల రద్దీ విశేషంగా కనిపించింది. ​ఎండ వేడిమి ప్రభావం దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సరఫరాను గణనీయంగా పెంచారు. తాగునీటి విభాగం సిబ్బంది నిరంతరం భక్తులకు చల్లని మంచినీటిని అందించేలా చర్యలు చేపట్టారు. నూతన అన్నదాన భవనంలో భక్తులందరికీ నిరంతరాయంగా వేడివేడి అన్నప్రసాద వితరణతో పాటు దర్శనానంతరం భక్తులందరికీ ఉచిత  ప్రసాదం నిరాటంకంగా అందేలా ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేశారు.

About Author