దుర్గమ్మ భక్తుడికే.. ప్రాధాన్యత..
1 min read
దసరా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం..
భక్తులకు సౌకర్యం, భద్రతే ప్రధాన బాధ్యతగా భావించాలి
దర్శనానికి 25 లక్షల మందికి పైగా రావొచ్చని అంచనా..
నాణ్యత ప్రమాణాలతో 60 లక్షల లడ్డు తయారీ.
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్
ఇంద్రకీలాద్రి, న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు – 2026 వైభవంగా నిర్వహించాలని దేవాలయ అధికారులు ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ సూచించారు. సోమవారం దేవాలయంలో దసరా మహోత్సవాల సమగ్ర ఏర్పాట్లపై సోమవారం ఉదయం ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు వర్ల రామయ్య, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు , రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ జి. ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్, డీసీపీ జి. రామకృష్ణ, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ , కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దర్శనార్ధం.. 25 లక్షలు పైగా..
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తేది 11.10.2026 నుండి 20.10.2026 వరకు వైదిక కమిటీ సూచనల మేరకు శాస్త్రోక్తంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ మహోత్సవాలలో అమ్మవారి దర్శనం కోసం వచ్చే సాధారణ భక్తులు మరియు ఉత్సవాల అనంతరం భవానీ దీక్షల విరమణకు వచ్చే భవానీ భక్తులతో కలిపి దాదాపు 25 లక్షల మందికి పైగా తరలివచ్చే అవకాశముందని అధికారుల అంచనాను వివరించారు. ఘాట్రోడ్లు, పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సమన్వయం చేస్తూ పటిష్టమైన కార్యాచరణ రూపొందించామని తెలిపారు.
క్యూ లైన్లలో ఎల్ఈడీ స్క్రీన్లు..
క్యూలైన్లలో భక్తులకు ఎండ, వర్షం తగలకుండా పూర్తిస్థాయిలో షెడ్లు, నిరంతర తాగునీటి సరఫరా, సేదతీరేందుకు కూర్చునే సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు క్యూలైన్లలో ఎంత సమయం పడుతుందో తెలియజేసేందుకు ఎల్ఈడీ / డిజిటల్ స్క్రీన్లను అమర్చుతున్నామని పేర్కొన్నారు.
శుచికరమైన అన్నప్రసాదం..
అధునాతన వసతులతో కూడిన నూతన ప్రసాదాల తయారీ మరియు విశాలమైన అన్నదాన భవనాల ద్వారా భక్తులందరికీ నిరంతరం శుచికరమైన అన్నప్రసాదం అందించనున్నట్లు చెప్పారు. భక్తుల కోసం అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో దాదాపు 60 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.
సంతోషంతో దర్శనం చేసుకోవాలి.. :
కేశినేని శివనాథ్ – చిన్ని (విజయవాడ ఎంపీ)
ఇంద్రకీలాద్రికి తరలివచ్చే ప్రతి సామాన్య భక్తుడూ ఎంతో సంతృప్తితో, సంతోషంగా అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని వెళ్లేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ రహిత విధానంలో, పర్యావరణహిత పద్ధతుల్లో ‘బబుల్స్’ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు చెప్పారు. క్యూలైన్లలో చంటిపిల్లలతో వచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా వేడిపాలు, బిస్కెట్లు నిరంతరం పంపిణీ చేసేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వీఐపీ సంస్కృతి ఉండకూడదు.. :
వర్ల రామయ్య (శాసన మండలి సభ్యులు)
దసరా నవరాత్రులు భక్తులందరి పండుగని, ఇందులో ఎలాంటి వీఐపీ సంస్కృతి లేకుండా సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సామాన్యులు గంటల తరబడి నిరీక్షించకుండా త్వరితగతిన దర్శనం పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమన్వయంతో..కృషి .. :
కె. రామచంద్ర మోహన్ (దేవాదాయ శాఖ కమిషనర్)
ఉత్సవాల వేళ విధులతో సంబంధం లేకుండా వివిధ శాఖల సిబ్బంది కొండపైకి రావడం వల్ల కొన్ని సున్నితమైన ప్రదేశాలలో రద్దీ నియంత్రణ సవాలుగా మారుతోందని, ఈ సమస్యను దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు, ఏఈవోలు సమన్వయంతో అధిగమించాలని ఆదేశించారు.
పటిష్ట బందోబస్తు… :
ఎస్.వి. రాజశేఖర్ బాబు (పోలీస్ కమిషనర్)
ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సరికొత్త ఏఐ (AI) కెమెరాలు, సిసిటీవి పర్యవేక్షణ, ప్రత్యేక నియంత్రణ కేంద్రం (కంట్రోల్ రూమ్) ద్వారా 24 గంటలూ కొండపై, పరిసర ప్రాంతాలలో నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా విస్తృతమైన ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేస్తున్నామని, నగర శివార్లలో మరియు ప్రధాన కూడళ్లలో పటిష్టమైన పార్కింగ్ కేంద్రాలను కేటాయించామని తెలిపారు. పార్కింగ్ ప్రదేశాల నుండి భక్తులను సురక్షితంగా తరలించేందుకు ఉచిత షటిల్ బస్సులను నిరంతరం నడుపుతామని వెల్లడించారు.
24 గంటలు వైద్య సేవలు.. :
ఇలక్కియ (జిల్లా జాయింట్ కలెక్టర్)
దసరా మహోత్సవాల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయం చేస్తూ విధుల కేటాయింపులు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తుల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఘాట్రోడ్లు, క్యూలైన్లు మరియు కీలక ప్రాంతాలలో 24 గంటలు పనిచేసే వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు మరియు అత్యవసర సేవల కోసం అంబులెన్సులను సిద్ధంగా ఉంచామని వివరించారు.




