అత్యంత వైభవంగా అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పురుషులు) వేదికగా బుధవారం అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కళాశాల యాజమాన్యం మరియు జిల్లా యువజన సంక్షేమ శాఖ – సెట్కూరు కర్నూలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ఇందిరా శాంతి అధ్యక్షత వహించారు. సెట్కూరు సీఈఓ డాక్టర్ కె.వేణుగోపాల్ కార్యక్రమ స్వాగతోపన్యాసం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయలసీమ యూనివర్సిటీ మరియు క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు ఇతర అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చగల సత్తా నేటి యువతకు మాత్రమే ఉందన్నారు. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను జోడించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథిగా హాజరైన క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. మారుతున్న గ్లోబల్ మార్కెట్‌కు అనుగుణంగా విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించార.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం, సెట్కూరు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


