తల్లి-బిడ్డల ఆరోగ్య భద్రతకు 102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు
1 min read
102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్వహించిన తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పాల్గొన్నారు. తల్లి, బిడ్డల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే ఎయిడ్స్ వంటి వ్యాధులపై సమాజంలో సరైన అవగాహన ఉండడం ఎంతో అవసరమని, ‘ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర’ రథం జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ వెళ్లి ప్రజలను చైతన్యపరుస్తుందని మంత్రి పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో తల్లి, నవజాత శిశువుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాన్పు అనంతరం తల్లి, శిశువులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ (102 వాహనాలు) సేవలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.మిగిలిన వాహనాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులకు కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోజుకు సగటున 8 నుంచి 10 ప్రసవాలు, నెలకు సుమారు 300 ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రతిరోజూ సుమారు 1,400 నుంచి 1,500 మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రతినిధులు, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.


