ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం
1 min read
పల్లెవెలుగు , కర్నూలు: రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న ఆర్య ఫంక్షన్ హాల్ లో కర్నూలు ఆవోప ఆధ్వర్యంలో శ్రీ టి జి లక్ష్మీ వెంకటేష్ ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య యువతీ యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముందుగా రిజిస్టర్ చేసుకున్న ఆర్యవైశ్య వధూవరుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కులమతాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు .ఆయన సహకారంతో అవోప ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ముఖ్యంగా ఆర్యవైశ్య సామాజిక వర్గంలో క్రమశిక్షణ అధికంగా ఉంటుందని, నేటి యువత ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు .ఆర్యవైశ్య సామాజిక వర్గంలోని ప్రస్తుత యువత తల్లిదండ్రుల మార్గదర్శనంలో ముందుకు సాగాలని వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య ధోరణి అధికంగా ఉందని దాని ప్రభావం మన దేశంలో కూడా ఉన్న నేపథ్యంలో యువత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలన్నారు .తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పెద్దవారిని చేస్తారని, అలాంటి పిల్లలు బాధ్యతగా మెలిగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని సూచించారు. చాలామంది యువత తల్లిదండ్రుల మాట కాదని సొంత ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని ఆయన వివరించారు. ఎవరైనా వివాహం చేసుకునే సందర్భంలో తాము చేసుకునే వ్యక్తి అన్ని విధాల ఆమోదయోగ్యుడై ఉండేలా చూసుకోవాలన్నారు.అవోపా ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతోమందికి వివాహాలు జరిగేలా చేయడం అభినందనీయమని స్పష్టం చేశారు .గతంలో అవోపా ఆధ్వర్యంలో జరిగిన వివాహ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమంలో వివాహం చేసుకొని అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులను సన్మానించారు. అనంతరం అవోపా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.
