పట్టు నిలుపుకునేందుకు నేతల ఆరాటం
1 min read
ఓటర్లను ఆకట్టుకుంటున్న నేతలు
వైసీపీకి తెదేపా ఫుల్ స్టాప్ పెట్టనుందా.?
చైర్మన్ హ్యాట్రిక్ వైసీపీ గురేనా.?
ప్రచారంలో శక్తి నంతా దారపోస్తున్న నేతలు
నేటి సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగింపు
1 న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలు..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పురపాలక ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి.పురపాలిక ఎన్నికల్లో భాగంగా పట్టణంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇరు పార్టీల నియోజకవర్గ ముఖ్య నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఎమ్మెల్యే తర్వాత రెండో స్థానమైన మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కోసం మొల్లా సాబేరున్నిసాను తెదేపా చైర్మన్ అభ్యర్థిగా అధికార తెదేపా సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య బరిలోకి దింపారు.అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా షేక్ ఫాతిమాభిని వైసీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నందికొట్కూర్ వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ బరిలోకి దింపారు.తమ అభ్యర్థినే గెలిపించుకొని పట్టణంలో పట్టు సాధించాలనే తపనతో ఇరు పార్టీల నేతలు ప్రజల వద్దకు వెళ్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రతి గల్లీని వదలకుండా ప్రతి ఇంటి తలుపు తడుతూ ఓటర్ల మనసును సంపాదించుకుంటున్నారు. అభ్యర్థుల నామినేషన్ వేయక ముందు నుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నేతలు సమయాన్ని వదలకుండా తమ శక్తినంతా ధారపొస్తున్నారు.
పట్టణ అభివృద్దే చైర్మన్ గా గెలుపు ఖాయం
ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల నిధులతో పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులే చైర్మన్ గెలుపుకు సువర్ణ అవకాశం అని చైర్మన్ తో పాటు 32 వార్డుల కౌన్సిలర్లను గెలుపొందడం ఖాయమని శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే ధీమాలో ఉన్నారు.రానున్న రోజుల్లో పట్టణాన్ని ఇంకా నందనవనంగా తీర్చి దిద్దుతామని వారు ప్రజలకు హామీ ఇస్తున్నారు.
వైసీపీ చైర్మన్ హ్యాట్రికా.?
నందికొట్కూరు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొదటగా వైసీపీ నుండి సుబ్బమ్మ,ఆ తర్వాత దాసి సుధాకర్ రెడ్డి వైసీపీ నుండే చైర్మన్ గా ఎన్నికయ్యారు.ఇప్పుడు మూడోసారి చైర్మన్ గా గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలనే తపనతో వైసిపి ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ హ్యాట్రిక్ కు టిడిపి ఫుల్ స్టాప్ పెట్టానుందా వేచి చూడాలి.గతం వరకు చైర్మన్ ను కౌన్సిలర్లు స్వయంగా ఎన్నుకునేవారు.కానీ ఇప్పుడు అలా కాకుండా చైర్మన్ ను ప్రత్యక్షంగా పట్టణంలో ఉండే 32 వార్డుల్లో కలిపి 36,332 మంది ఓటర్లు స్వయంగా చైర్మన్ కు ప్రత్యక్షంగా ఓటు వేసి ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చారు.
నేటి సాయంత్రం 5 గం.లకు ప్రచారం ముగింపు
నవంబర్ 1వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు ఉండటంతో ఈరోజు శుక్రవారం సా 5 గంటల వరకే ఎన్నికల ప్రచారం ఉంటుంది.పోలింగ్ తర్వాత మూడవ తేదీన పట్టణంలోని ప్రభుత్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ ఉండనుంది. చైర్మన్ పీఠం ఎవరి చేతుల్లోకి రానుందనేది కౌంటింగ్ రోజు వరకు వేచి ఉండాల్సిందే..




