NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిద్దాం

1 min read

ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి ప్రత్యేక శిక్షణ

అశ్రద్ధ, అజాగ్రత్త ఏమాత్రం తగదని హితవు

అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ, కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచనలు

కర్నూలు, న్యూస్​ నేడు:  బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తూ, ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల్లో అశ్రద్ధ, అజాగ్రత్తకు ఏమాత్రం తావివ్వకూడదని అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. బుధవారం ఎస్‌బీఐ ఎంప్లాయీస్‌ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో రిటర్నింగ్‌ అధికారులు, మున్సిపల్‌ సిబ్బందికి శిక్షణ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చల్లా ఓబులేసు మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల పునర్విభజన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, మరమ్మతులు, రిజర్వేషన్లు, కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు తదితర ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో 68 వార్డులు ఉండగా, మొత్తం 4,79,861 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో 2,32,508 మంది పురుషులు, 2,47,295 మంది మహిళలు, 58 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారని వివరించారు. ప్రతి నాలుగు వార్డులకు ఒక రిటర్నింగ్‌ అధికారిని నియమించి, ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేయర్‌, కార్పొరేటర్‌ పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు కనీస వయస్సు 21 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియను చిత్రీకరించేందుకు వీడియో గ్రాఫర్లను నియమిస్తున్నట్లు, ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసినట్లు తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులు తమ లాగిన్‌ల ద్వారా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో ప్రతిరోజూ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన హ్యాండ్‌బుక్‌లను పూర్తిగా చదివి, నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలను ఓటర్లు ఒకే బ్యాలెట్‌ బాక్స్‌లో వేయాల్సి ఉంటుందని వివరించారు. పోలింగ్‌ అనంతరం ప్రత్యేక బందోబస్తు మధ్య బ్యాలెట్‌ బాక్సులను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తునట్లు పేర్కొన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చు పరిమితులను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్‌ సూచించారు. మేయర్‌ అభ్యర్థి గరిష్ఠంగా రూ.25 లక్షలు, కార్పొరేటర్‌ అభ్యర్థి రూ.10 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల నోడల్‌ అధికారి, అదనపు కమిషనర్‌ ఆర్‌.జి.వి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *