ఏలూరు కార్పొరేషన్ ని 62 డివిజన్లకు రిజర్వేషన్ల నోటిఫికేషన్ విడుదల
1 min read
మేయర్ పదవి బిసి జనరల్ కు రిజర్వు
నగరపాలక సంస్థ కమిషనర్ అన్నాప్రగడ భాను ప్రతాప్
ఈ నెల 16వ నుంచి 18వ వరకు 62 డివిజన్లకు నామినేషన్లను స్వీకరిస్తాం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ పదవి బిసి జనరల్ కు రిజర్వు చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ అన్నాప్రగడ భాను ప్రతాప్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏలూరు కార్పొరేషన్లోని 62 డివిజన్లకు రిజర్వేషన్ల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ శుక్రవారం నుంచి 18వ తేదీ వరకు మేయర్ పదవితో పాటు 62 డివిజన్లకు సంబంధించి నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘం నియమించిన రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు) మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉండి నామినేషన్ల ప్రక్రియను నిర్వహిస్తారని వివరించారు. 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని వివరించారు. ఈ నెల 28వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 62 డివిజన్లకు మొత్తం 255 పోలింగ్ కేంద్రాలనుఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే ఈ నెల 29వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 8 గంటలకు నిర్దేశించిన కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని భాను ప్రతాప్ చెప్పారు. ఓటర్లకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వివరాలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం సాఫ్ట్వేర్లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే,ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకునేందుకు ‘వేర్ ఈజ్ మై ఓట్’ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


