పరిశ్రమల స్థాపనకు భూముల కొరతనేవీ,ఆయుధ డిపో ప్రాజెక్టుకి బ్రేక్
1 min read
ఎంపీ పుట్టా మహేష్ కుమార్
జిల్లాకు పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారన్న ఎంపీ
30 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన సియంఆర్ ఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కొయ్యలగూడెం వద్ద తలపెట్టిన నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏర్పాటు నిర్ణయం విరమించుకున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. గురువారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. 90శాతం మంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ, కొందరు స్థానిక నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించి, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో సమస్య ఏర్పడిందన్నారు. ప్రస్తుతానికి నేవీ డిపో ప్రాజెక్టు ఏర్పాటు పనులు ఆపివేసినట్లు ఎంపీ స్పష్టం చేశారు. కోకో సిటీ ఏర్పాటుకు భూముల పరిశీలన జరుగుతోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కోకో సిటీ ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పిన ఎంపీ, ఎక్కడ పెట్టేది త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. ఏలూరు పార్లమెంటులో అభివృద్ధి జరగాలని కోరుకుంటూ పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తాను ప్రయత్నిస్తుంటే కొంతమంది అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. ఏదేమైనా అభివృద్ధి పనులు ఆగకుండా చూస్తామన్నారు. ఆయిల్ పామ్ పంటకు మంచి భవిష్యత్తు ఉందని, జిల్లాలో పొగాకు సాగు చేస్తున్న రైతులు కూడా కొంతమేర పొగాకు పంటను తగ్గించుకొని,పామాయిల్ పంట వైపు మళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఆయిల్ పామ్ గెలలకు గతంలో ఎన్నడూ లేనంత మంచి ధర లభిస్తోందన్న ఎంపీ, భవిష్యత్తులో మరింత ధరలు పెరుగుతాయని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 56 స్మశాన వాటికలకు నిధులు కేటాయించామని, అనేక చోట్ల నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు. నూజివీడు ప్రాంతంలో ఇటీవలే కొన్ని పరిశ్రమలు వచ్చాయని, మరికొన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఏంటి వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో భూముల కొరత అడ్డంకిగా మారిందన్నారు. ఏలూరులో పబ్లిక్ లైబ్రరీ పునర్మాణ పనులు కూడా ఈ సంవత్సరంలోనే మొదలు పెడతామని అన్నారు. జిల్లాలో బీసీ హాస్టల్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ద్వారకాతిరుమల్లో ఒక కళ్యాణమండపం నిర్మాణానికి నాయి బ్రాహ్మణుల సంఘం తరపున కోరగా,నిబంధనలు సవరించి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని, త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశిస్తున్నానన్నారు. ఏలూరు పార్లమెంటులో ప్రతి పల్లెకి రోడ్డు సౌకర్యం ఉండాలనేది తన లక్ష్యం అన్న ఎంపీ, ఇప్పటికే అనేక గ్రామాల్లో రోడ్లు నిర్మించామని,ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మరికొన్ని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
ఉదయం ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన సీఎం ఆర్ ఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత 23 నెలల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన 1200 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ ఫ్ ద్వారా ఆర్ధిక సాయం అందించగలిగామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ అనంతరం ఎంపీ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. గ్రీవెన్స్ కోసం ప్రజలు భారీగా తరలి రావడంతో ఎంపీ క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎంపీ, వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారు. గ్రీవెన్స్ కార్యక్రమం ముగిసిన అనంతరం పెదపాడు మండలం కొత్తూరు వెళ్ళిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఈరోజు ఉదయం మరణించిన గ్రామ టీడీపీ నేత గోవిందరావు తండ్రి ఆవల పెద్ద సోమయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు.


