NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పొట్టి శ్రీరాములు త్యాగం మ‌రువ‌లేనిది.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్

1 min read

విజ‌య‌వాడ‌లో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం ఆవిష్కర‌ణ‌

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భ‌ర‌త్

విజయవాడ, న్యూస్​ నేడు:  అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎప్పటికీ మ‌రువ‌లేనిద‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. సోమవారం అమరావతిలోని శాఖమూరు పార్కులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అమరావతిలో తొలి భారీ శిల్పంగా పొట్టి శ్రీరాములు విగ్రహం నిలుస్తుంది. శాఖమూరు పార్కులోని 6.80 ఎకరాల్లో అమరజీవి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 6 నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్ట్ మొదటి దశ పనులను ట్రస్ట్ పూర్తి చేసింది. ఈ భారీ విగ్రహానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగించారు. రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, సవిత సహా పలువురు ప్రజా ప్రతినిధులు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో క‌లిసి మంత్రి టీజీ భ‌ర‌త్ పాల్గొన్నారు. అమరజీవి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా టీజీ భ‌ర‌త్ మాట్లాడుతూ త‌మ టీజీవీ గ్రూప్ త‌రుపున ఎన్నో విరాళాలు ఇచ్చామ‌ని అన్నారు. అయితే పొట్టి శ్రీరాములు విగ్రహం నిర్మాణం కోసం రూ.1 కోటి విరాళం ఇవ్వడం ఎంతో సంతోషాన్ని క‌లిగించింద‌న్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం వ‌ల్లే తెలుగు ప్రజ‌ల కోసం అప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంద‌న్నారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు రాష్ట్రం, దేశం కోసం పోరాటం చేశార‌ని, వారంద‌రినీ స్మరించుకుంటామ‌న్నారు. కూట‌మి ప్రభుత్వం ప్రజ‌ల‌కు మంచి చేసే ప్రభుత్వమ‌ని ఆయ‌న అన్నారు.

About Author