ప్రకృతి వైపరీత్యాల ఎదుర్కొనేందుకు సంసిద్ధత ప్రణాళిక సిద్ధం చేయాలి
1 min read
వేసవిలో త్రాగునీటి ఎద్దడి జిల్లాలో ఎక్కడా తలెత్తకూడదు
వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు అవగాహనా కలిగించాలని అధికారులకు ఆదేశం
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రానున్న వర్షాకాలంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం అన్ని శాఖల అధికారులతో రానున్న వర్షాకాలంలో వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవలసిన సంసిద్ధత చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వర్షాకాల సమయంలో తూఫాన్, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గోదావరి తీర ప్రాంతంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అనువైన ప్రదేశాలను ముందుగానే గుర్తించాలన్నారు. ఆ ప్రదేశాలలో ప్రజలను ఉంచేందుకు తాత్కాలిక షెడ్లు, త్రాగునీరు, టాయిలెట్లు, వంటి సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. వర్షాల కారణంగా కూలిపోయే శిధిలావస్థలో ఉన్న భవనాలు, బ్రిడ్జి లు, కల్వర్టులు, కాజ్ వే లను గుర్తించి, ముందుగానే మరమ్మత్తులు చేయించాలన్నారు. వర్షకాల సమయంలో వాటి కారణంగా ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా ముందుగానే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. నదులు, కాల్వలు, చెరువులు గట్లను పరిశీలించి బలహీనం చోట్ల పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత వరదల సమయంలో గండ్లు పడిన ప్రదేశాలను పరిశీలించి, అవసరమైన చోట పటిష్టం చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూలిపోయిన చెట్లను తొలగించేందుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తుఫాన్లు, వరదల సమయంలో విద్యుత్ స్థంబాల కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు ముందస్తుగానే సంసిద్ధత చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకూడదు: వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కలిగించాలి కలెక్టర్ వేసవిలో జిల్లాలో ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లాపరిషత్ సీఈఓ కె. భీమేశ్వరరావు, డి ఆర్ డిఏ పీడీ కె. విజయరాజు, డిఎంహెచ్ఓ డా. మాలిని, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, డిపిఓ కె. అనురాధ,ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాథ్ బాబు,ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భాను ప్రతాప్, ఉప రవాణా కమీషనర్ కరీం , ప్రభృతులు పాల్గొన్నారు.
