కర్నూలు నుండి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించండి.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min read
ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నుండి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి కర్నూలు నుండి ముంబైకి వారంలో ఒకటి లేదా రెండు సార్లు, అదేవిధంగా కర్నూలు నుండి విజయవాడకు ప్రతి రోజూ రైలు సర్వీసులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రిని కోరినట్లు టి.జి భరత్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు కర్నూలు రాజధానిగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రాంతాన్ని రైల్వే పరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని విన్నవించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్‌లో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. భవిష్యత్తులో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఓర్వకల్లు మారబోతుందన్నారు. ఈ ప్రాంతానికి దేశంలోని ప్రధాన నగరాలతో రైలు రాకపోకలు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు టి.జి భరత్ తెలిపారు.


