పారిశ్రామిక అభివృద్ధికి రైల్వే అనుసంధానం ఎంతో అవసరం..
1 min read
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్
పారిశ్రామిక కారిడార్లలో రైల్వేలైన్ల అభివృద్ధిపై కేంద్ర మంత్రితో చర్చించిన మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్‌లో ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి వేగంగా జరిగేందుకు పూర్తిగా సహకరించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై టి.జి భరత్ చర్చించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడ్స్ హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఓర్వకల్ నోడ్, చెన్నై- బెంగుళూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నం నోడ్‌ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నోడ్‌లకు రైల్ కనెక్టివిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రితో చర్చించి వినతిపత్రం అందజేశారు. ఓర్వకల్ నోడ్ కింద దూపాడు రైల్వే స్టేషన్ నుండి ఓర్వకల్ మీదుగా బేతంచర్ల వరకు కొత్త కార్డ్ రైల్వే లైన్ అభివృద్ధి, ఓర్వకల్ పారిశ్రామిక నోడ్ వరకు రైల్వే సైడింగ్ 53 కిలో మీటర్లు అభివృద్ధి చేయాలని కోరారు. దీంతో పాటు కృష్ణపట్నం రైల్వే స్టేషన్ నుండి ఓబులవారిపల్లె- కృష్ణపట్నం సెక్షన్ నుండి కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్ వరకు రైల్వే సైడింగ్ 12 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలన్నారు. ఓర్వకల్ మరియు కృష్ణపట్నం నోడ్‌లను ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు ఇంటిగ్రేటెడ్ మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులతో స్థిరమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇవి అభివృద్ధి చెందితే 4 లక్షలకుపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయనని చెప్పారు. అంతేకాకుండా విదేశీ పెట్టుబడులతో సహా సుమారు రూ. 55,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ ఎంతో ముఖ్యమని చెప్పారు. ఇది రాష్ట్రం యొక్క ఆర్థిక వృద్ధికి అత్యంత అవసరమన్నారు. ఎన్ఐసిడిఐటి ఫ్రేమ్‌వర్క్ కింద మూడు పారిశ్రామిక కారిడార్లలో మూడు నోట్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రస్తుతం చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నం నోడ్ ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఓర్వకల్, వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద కొప్పర్తి నోడ్‌లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిపారు. 73వ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ సమావేశంతో పాటు డిపిఐఐటీ సమావేశాల్లో రాష్ట్రంలోని అవసరమైన పారిశ్రామిక నోడ్‌లకు రైలు కనెక్టివిటీని అందించాలని సూచించిందని కేంద్ర మంత్రికి వివరించారు. ఓర్వకల్, కృష్ణపట్నం నోడ్‌లకు ప్రతిపాదిత రైల్వే సైడింగ్/లైన్ల అభివృద్ధిని చేపట్టడానికి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వ శాఖ వీలైనంత త్వరగా ఆమోదించేలా చూడాలని ఆయన కోరారు. ఈ నోడ్‌లకు రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం వల్ల లాజిస్టిక్స్ పార్కులు, కార్గో టెర్మినల్స్, ఓడరేవులకు వస్తువులను తరలించేందుకు వీలుంటుందన్నారు.