దివ్యాంగుల గౌరవం పెంచేలా… ప్రభుత్వం కృషి..
1 min read

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
- పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు, న్యూస్ నేడు: దివ్యాంగుల గౌరవం పెంచేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. బుధవారం కర్నూలు కొత్త బస్టాండ్ లో దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్ డా. ఏ.సిరి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అందుబాటులో సేవలను మరింత విస్తరించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ….దివ్యాంగులకు పెన్షన్ ద్వారా జిల్లాలోని 30,150 మందికి ప్రతి నెల రూ.18 కోట్ల 66 లక్షల మొత్తాన్ని నేరుగా వారి ఇంటికే వెళ్లి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. దివ్యాంగుల సాధికారత కోసం ఇప్పటి వరకు 76 ల్యాప్‌టాప్‌లు, 65 టచ్ ఫోన్లు, 40 ట్రైసైకిళ్లు, 142 వీల్చైర్లు పంపిణీ చేయగా, త్వరలోనే మరో 70 మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు అందించనున్నట్లు తెలిపారు. అలాగే, దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్‌లాగ్‌లో ఉన్న 17 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, మిగిలిన విభాగాల్లో ఖాళీల వివరాలు సేకరించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఐవీఆర్ఎస్ కాల్స్ నిర్వహిస్తున్నట్లు, బస్ స్టేషన్లలో త్రాగునీరు, శౌచాలయాలు, శానిటేషన్ వంటి సౌకర్యాల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.50 లక్షలు ఖర్చు చేయగా, మరిన్ని పనుల కోసం రూ.1.2 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్ లకు సరైన సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆ తరువాత కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళలకు అందించిన విధంగానే, దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సదుపాయం అందించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బొందుల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింహ, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీనివాసులు, కర్నూల్ డిపో మేనేజర్ సుధారాణి , ఎడి డిజేబుల్ ఫాతిమా రయీస్ , జాతీయ అంధుల సమాఖ్య అధ్యక్షులు పుష్ప రాజ్ , ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ జేమ్స్, జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు ఎల్లప్ప, జిల్లా విభిన్న ప్రతిభావంతుల ప్రభుత్వ ఉద్యోగస్తుల అధ్యక్షులు కృష్ణుడు, బదిరుల సంఘం అధ్యక్షుడు సాదిక్ భాష , జనసేన జిల్లా అధ్యక్షులు హర్షత్, తదితరులు పాల్గొన్నారు.



