పది మంది బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు
1 min read
కర్నూలు ఆర్వో, కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశం
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో అలసత్వంపై ఆగ్రహం
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియలో వెనుకబడిన పది మంది బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో మ్యాపింగ్ ప్రక్రియలో వెనుకంజలో ఉన్న బీఎల్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన బీఎల్వోలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిర్దేశించిన 45 రోజుల గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే బీఎల్వోలు, ఎన్నికల సిబ్బందికి 2002 ఓటరు జాబితాను 2026 ఓటరు జాబితాతో సరిపోల్చే ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు.అన్ని ఏర్పాట్లు, శిక్షణలు పూర్తయినప్పటికీ కొందరు బీఎల్వోలు అలసత్వం ప్రదర్శించడం సమంజసం కాదని కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

