NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పథకాల అమలులో వేగం పెంచండి

1 min read

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు:జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సేవల మెరుగుదల, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనంతరం పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నందున, మున్సిపల్ కమిషనర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తిరుపతి, నాయుడుపేట ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.  కార్యాలయాల్లో ఫైళ్ల నిర్వహణ, వాట్సాప్ సేవలు, KPI డేటా ఎంట్రీలను మెరుగుపరచాలని, సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల నుంచి ప్రభుత్వ సేవలపై ప్రతికూల స్పందన వస్తోందని, దీనిని సరిచేసేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని సూచించారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న అభ్యాసకుల ఫలితాలను తక్షణమే అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 3,000 ఖాతాల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించి అభివృద్ధి పనులకు వినియోగించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు కేవలం 79 ఖాతాల నుండి రూ.48.72 లక్షలు మాత్రమే జమ అయినందున, మిగిలిన ఖాతాల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణాన్ని అభినందించిన కలెక్టర్, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. సరైన క్యూరింగ్ లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆధునిక సాంకేతికతల వినియోగంతో రోడ్ల జీవితకాలాన్ని పెంచాలని సూచించారు. జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

About Author