జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
మత్తు పదార్థాల వినియోగం, గంజాయి సాగు, అమ్మకం చేస్తే కఠిన చర్యలు తప్పవు
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ (NCORD) సమావేశాన్ని నిర్వహించారు. గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం, నియంత్రణ చర్యలపై సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీ ల్లో విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి, గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.వచ్చే విద్యా సంవత్సరం నుండి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పాఠశాలల్లో వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, ర్యాలీలు, ప్రతిజ్ఞ ల ద్వారా విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ డీఈవో ను ఆదేశించారు.విద్యా సంవత్సరం మొదలు కాగానే విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని డీఈవో ను ఆదేశించారు. పోలీస్ శాఖ తో పాటు ఇతర శాఖల అధికారులు 11 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి, మాదకద్రవ్యాల నియంత్రణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో నాసర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డిటీసీ శాంత కుమారి, ఎక్సైజ్ సూపరిన్టెండెంట్ సుధీర్ కుమార్, డిఎంహెచ్వో శాంతి కళ, జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
