సాగు నీటి పన్ను వసూలుకు చర్యలు చేపట్టండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ఏళ్ల తరబడి పేరుకుపోయిన సాగునీటి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సాగు నీటి పన్ను వసూళ్లు, ఆయకట్టు స్థిరీకరణపై ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ సాగునీటి కాలువల ద్వారా సాగు చేసిన భూములకు నీటిపారుదల రుసుం వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కెసి కెనాల్ ద్వారా 1,62,854.46 ఎకరాలకు, ఎస్ఆర్బిసి ద్వారా 1,53,034.8 ఎకరాలకు, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా 1,28,246.73 ఎకరాలకు, మైలవరం రిజర్వాయర్ ద్వారా 740.21 ఎకరాలకు, శివ భాష్యం సాగర్ ప్రాజెక్టు ద్వారా 12,092 ఎకరాలకు, 104 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 40,056.79 ఎకరాలకు నీరు అందివ్వడం జరుగుతుందన్నారు. అందుకు గాను మాన్యువల్ ప్రకారం దాదాపు 20 కోట్ల డిమాండ్ మేర సాగునీటి పన్ను వసూళ్లు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఉన్న 360 గ్రామాల నుండి నీటి పన్ను వసూలు చేయడం జరుగుతోందని మిగిలిన 104 గ్రామాలకు నీటి పన్ను వర్తించరాదన్న అంశంపై ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది పునఃపరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే నీటి పన్ను కోసం 338 గ్రామాల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయడం జరిగిందని పెండింగ్ ఉన్న 24 గ్రామాల వివరాలను కూడా బుధవారం సాయంత్రం లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు పాత బకాయిలు, 1431 ఫసిలి వరకు నీటి పన్ను మొత్తం దాదాపు 20 కోట్ల రూపాయలుగా లెక్కించడం జరిగిందని, లెక్కించిన మొత్తాన్ని త్వరితగతిన వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.సిద్దాపురం లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి 21,300 ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆయకట్టు స్థిరీకరణ చేసేలా రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నీటిపారుదల శాఖ సూపరింటెండ్ ఇంజనీర్లు రెడ్డి శేఖర్ రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.