పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలి
1 min read
ఎస్ఎస్ సి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక అశోక్ నగర్ కెపిడిటి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎస్ఎస్ సి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పరీక్ష గదుల్లోకి ఇన్విజిలేటర్లు, సిబ్బంది,విద్యార్థులు సేల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు,ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులు తీసుకు రాకూడదన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.ఈ పరీక్ష సెంటర్లో ఎంతమంది హాజరు కావాల్సి ఉంది, ఈ రోజు ఎంతమంది హాజరయ్యారని జిల్లా కలెక్టరు ఆరా తీశారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాలు పరిధిలో 144 సెక్షన్ ఖచ్చితంగా అమలు చెయ్యాలని, పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జీరాక్స్ కేంద్రాలను, ఇంటర్ నెట్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్ష సమయంలో ఎటువంటి విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలు వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లను, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రతి రూమ్ వద్ద చల్లటి త్రాగునీటి సౌకర్యాన్ని తప్పనిసరిగా ఏర్పాట్లు చెయ్యాలని పత్రికా ప్రకటలో తెలిపారు.

