ఇంచార్జ్ మంత్రి చొరవతో తీరిన గిరిజనుల దాహార్తి
1 min read
మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో ఇంటింటికీ త్రాగునీరు సరఫరా చేస్తున్న అధికారులు
పులిరాముడిగూడెంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆర్వో ప్లాంట్- మంత్రి మనోహర్ హామీ
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా రెండురోజులపాటు గిరిజన ప్రాంతాలలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్. తన పర్యటనలో భాగంగా ఈనెల 23వ తేదీన బుట్టాయిగూడెం మండలం పులిరాముడిగూడెం పర్యటించగా అక్కడి ప్రజలు తమకు త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ వెంటనే ఆ ప్రాంత గిరిజనల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకోవాలని, అంతవరకూ ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని, ఐ.టి.డి. ఏ. ప్రాజెక్ట్ అధికారిని, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను మంత్రి మనోహర్ ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు ముందుగా వెంటనే ఇంటింటికి రక్షిత త్రాగునీతిని ప్రతీరోజు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారంగా గ్రామ పంచాయతీ ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు 2. 50 లక్షల రూపాయలు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించాలని మంత్రి మనోహర్ అధికారులను ఆదేశించారు. అంతేకాక గిరిజన ప్రాంతాలతో పాటు జిల్లాలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 971. 80 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కింద 501.43 లక్షలు, మండల ప్రజా పరిషత్తులకు 270.37 లక్షల నిధులు ఉన్నాయి. వాటి ద్వారా హ్యాండుపంపుల మరమ్మత్తులు, రక్షిత మంచినీటి పథకాల మరమ్మత్తులు కొనసాగుతున్నాయి.పోలవరం నియోజకవర్గ గిరిజన ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీరు అందించేందుకు 15వ కమిషన్ గ్రాంట్ కింద 41.55 లక్షలు, అలాగే మండల ప్రజా పరిషత్ ఫైనాన్స్ నిధుల కింద 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి.గతంలో ఎంతోమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు వచ్చి తమ సమస్యలను తెలుసుకుని హామీలు ఇచ్చి వెళ్లడమే గాని, పరిష్కరించలేదని, ఇప్పుడు కూడా అలాగే అనుకున్నామని, కానీ ఇచ్చిన హామీని వెనువెంటనే అమలు చేసి, తమ గ్రామంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే కాక, గిరిజన ప్రాంతాలలో త్రాగునీటి సమస్యకు లక్షలాది రూపాయలు మంజూరు చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అసలు,సిసలైన ప్రజాప్రతినిధి అని, వారికి తమ గ్రామ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటామని పులిరాముడుగూడెం ప్రజలు తమ కృతజ్ఞతలను తెలియజేస్తున్నారు.
