ఓటు అనే ఆయుధంతో కూటమి ప్రభుత్వ పాలనకు బుద్ధి చెప్పాలి
1 min read
ఓటమి భయంతో పోలీసు వ్యవస్థను ఉపయోగించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
చిప్పగిరి మీడియా సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
ఆలూరు న్యూస్ నేడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజలు బదులివ్వాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పిలుపునిచ్చారు. గురువారం చిప్పగిరి మండల కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అలాంటి కార్యక్రమాలను అడ్డుకోవడం సరైన చర్య కాదని అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.చిప్పగిరి మండలం నగరడోణ గ్రామంలో ఎస్సై నరసింహులు టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారనే కారణంతో మహిళలను బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మహిళలపై బైండోవర్ చర్యలు తీసుకుంటామని, గంజాయి కేసులు నమోదు చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు, మహిళలు, ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విరుపాక్షి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి ఎన్నికలు ఒక ముఖ్యమైన అవకాశమని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, ఫ్యాన్ గుర్తుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. తమ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుంటూ, ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు జగనన్నకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణే తమ పార్టీ లక్ష్యమని పేర్కొంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కోరారు.


