అశోకా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా యువజనోత్సవాలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక ప్రతిభ, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను వెలికితీసి వారికి తగిన ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, సెట్కూర్ కర్నూలు జిల్లా నిర్వహణలో, అశోకా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా కర్నూలు జిల్లా యువజనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. యువతలో ప్రతిభను గుర్తించి, వారికి వేదిక కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, బాధ్యతాయుత పౌరసత్వం వైపు వారిని ప్రోత్సహించేలా కార్యక్రమాలను నిర్వహించారు.జిల్లా యువజనోత్సవాల్లో భాగంగా యువత కోసం నాటక ప్రదర్శన, జానపద గీతాలు, జానపద నృత్యాలు, చిత్రలేఖనం, కవితా రచన వంటి వివిధ సాంస్కృతిక మరియు సృజనాత్మక పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ కళాశాలలు, విద్యాసంస్థల నుంచిదాదాపుగా 800 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.కార్యక్రమానికి కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి ముఖ్య అతిథిగా హాజరై యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవడం నేటి పోటీ ప్రపంచంలో యువతకు ఎంతో అవసరమని తెలిపారు.యువత తమలోని ప్రతిభను గుర్తించి, దానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కేవలం విద్యార్హతలకే పరిమితం కాకుండా వృత్తి నైపుణ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత వంటి అంశాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా యువత తమ భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న యువత తమ ప్రతిభను వివిధ విభాగాల్లో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. నాటక ప్రదర్శన, జానపద గీతాలు, జానపద నృత్యాలు, చిత్రలేఖనం, కవితా రచన విభాగాల్లో నిర్వహించిన పోటీల ద్వారా యువతలోని విభిన్న ప్రతిభా సామర్థ్యాలు వెలుగులోకి వచ్చాయి.కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, అశోకా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి, అధ్యాపకులు, న్యాయనిర్ణేతలు, వాలంటీర్లు, విద్యార్థులు మరియు యువతకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.



