NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరులో వైఎస్సార్‌సీపీలోకి 50 కుటుంబాల చేరిక

1 min read

మొలగవల్లిలో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు

ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న కుటుంబాలు

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని మొలగవల్లి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం, స్థానిక టీడీపీ ఇన్‌చార్జి వైఖరితో విసిగిపోయి పలువురు పార్టీని వీడుతున్నారని ఆయన అన్నారు.గత రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువగా ఉందని, కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి స్వార్థానికి ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్‌సీపీలో కొత్తగా చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పాత, కొత్త నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మొలగవల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *